రైతులను రోడ్డున పడేసిన సీఎం – హరీశ్
కాంగ్రెస్ సర్కార్ పై తీవ్ర ఆగ్రహం
హైదరాబాద్ – మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు నిప్పులు చెరిగారు. ఆరుగాలం శ్రమించి పంటలను పండించే రైతులను నిట్ట నిలువునా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై ఒక్క సమీక్ష కూడా చేపట్టిన పాపాన పోలేదన్నారు. ఇదేనా బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి తీరు అని మండిపడ్డారు.
ఓ వైపు పండించిన ధాన్యానికి కనీస మద్దతు ధర లభించడం లేదని, ఇంకో వైపు వర్షాల తాకిడి కారణంగా పంట చేతికి వస్తుందో లేదోనన్న ఆందోళనలో రైతులు ఉన్నారని , వారికి ఈ సమయంలో భరోసా కల్పించాల్సిన సీఎం గాలి మోటార్లు ఎక్కుతూ గాలి కబుర్లు చెబుతున్నారంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. రైతు భరోసా, రైతు బంధు ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో అందలేదని ఆరోపించారు.
రైతుల ఓట్లు కావాలి కానీ రైతులు పండించిన వడ్లు , ధాన్యం పట్టదా అని ప్రశ్నించారు సీఎంను హరీశ్ రావు. సీఎంగా ఇప్పటి వరకు వడ్ల కొనుగోలుకు సంబంధించి సమీక్ష చేపట్టలేదని , అసలు వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నారో లేదో కూడా తెలియడం లేదంటూ ఎద్దేవా చేశారు . పదే పదే తాను రైతు బిడ్డనంటూ చెప్పుకునే రేవంత్ రెడ్డి ఇలాగేనా వ్యవహరించేది అంటూ ఆవేదన చెందారు. రైతులను ఇబ్బంది పెట్టిన ఏ సర్కార్ బతికి బట్ట కట్టిన దాఖలాలు లేవన్నారు.