ఆర్టీసీ ఛార్జీల మోత ప్రయాణీకులకు వాత
బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డి ఫైర్
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) అనుసరిస్తున్న విధానాల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు భారత రాష్ట్ర సమితి పార్టీ సీనియర్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డి. సోమవారం ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రయాణీకులకు మెరుగైన వసతి సౌకర్యాలను కల్పించాల్సింది పోయి ఉన్నట్టుండి ప్రయాణీకులపై ధరాభారం మోపడం దారుణమని అన్నారు.
ఓ వైపు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటూనే మరో వైపు పురుష ప్రయాణీకులకు కోలుకోలేని షాక్ ఇస్తోందంటూ మండిపడ్డారు. పండుగలు, జాతరల సందర్బంగా అందినంత మేర దండుకునే ప్రయత్నం ఆర్టీసీ చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నియమ నిబంధనల ప్రకారం నిర్దేశించిన మేరకే ప్రయాణానికి సంబంధించి ఛార్జీలు ఉండాలని , కానీ అందుకు విరుద్దంగా ఆర్టీసీ అడ్డగోలుగా స్పెషల్ బస్సుల పేరుతో భారీ ఎత్తున ఛార్జీల మోత మోగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇందుకు సంబంధించి ఆయన పెంచిన ధరతో కూడిన టికెట్ ను షేర్ చేశారు. వాస్తవానికి కరీంనగర్ నుంచి జూబ్లీ హిల్స్ బస్ స్టేషన్ కు రావాలంటే రూ. 310 చెల్లించాల్సి ఉంటుందని, కానీ దానిని రూ. 470కి పెంచారని ఆరోపించారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వాకం కారణంగా బతకడమే గగనంగా మారిందని, ఈ తరుణంలో ఛార్జీలు పెంచితే సామాన్యులు ఎలా ప్రయాణం చేస్తారంటూ ప్రశ్నించారు. ఆర్టీసీని కాపాడు కోవాల్సిన బాధ్యత సర్కార్ పై ఉందన్నారు.