డీకే అరుణ 15 కోట్లు డిమాండ్
వంశీ చందర్ రెడ్డి ఆరోపణ
మహబూబ్ నగర్ – ఏఐసీసీ జాతీయ కార్యదర్శి , మాజీ ఎమ్మెల్యే వంశీ చందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ జాతీయ నాయకురాలు డీకే అరుణపై నిప్పులు చెరిగారు. తాము ముందుగా చెప్పిన తేదీ, సమయానికి పాలమూరు లోని టీచర్స్ కాలనీ రామాలయానికి వచ్చామని అన్నారు.
ఆదివారం వంశీ చందర్ రెడ్డి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరితో కలిసి మీడియాతో మాట్లాడారు. తాము డీకే అరుణ చేసిన సవాల్ ను స్వీకరించామని, మరి ఎందుకు రాలేదని ప్రశ్నించారు.
దేవుడి సాక్షిగా తాను ప్రమాణం చేసి చెబుతున్నానని, డీకే అరుణ గత 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీని రూ. 15 కోట్లు డిమాండ్ చేసిందని సంచలన ఆరోపణలు చేశారు వంశీ చందర్ రెడ్డి. ఇప్పటికైనా తప్పు ఒప్పుకోవాలని, ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలు అంతా గమనిస్తున్నారని అన్నారు. ఇకనైనా రాజకీయాలు చేయడం మానుకోవాలని అన్నారు.