మాజీ సర్పంచ్ ల అరెస్ట్ అక్రమం – కేటీఆర్
బిల్లులు చెల్లించకుండా వేధిస్తే ఎలా..?
హైదరాబాద్ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. తమకు రావాల్సిన పెండింగ్ బిల్లులు చెల్లించాలని కోరుతూ సీఎంకు వినతి పత్రం ఇచ్చేందుకు నగరానికి వచ్చిన మాజీ సర్పంచ్ లను అరెస్ట్ చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఎక్స్ వేదికగా స్పందించారు.
అంతే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ మాజీ సర్పంచ్ లను అడ్డు కోవడం, అక్రమంగా అదుపులోకి తీసుకోవడం దారుణమన్నారు కేటీఆర్. వారిని అరెస్ట్ చేయడాన్ని తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.
పెండింగ్ బిల్లులు ఇవ్వాలని గత ఏడాది కాలంగా అడిగినా ఇవ్వక పోవడం సిగ్గుచేటు అని పేర్కొన్నారు .
రాష్ట్రంలో నిత్యం అరెస్టుల పర్వమే కొనసాగుతోందని ఆరోపించారు. పోలీసులతో సమస్యలను అణగదొక్కాలని ప్రభుత్వం చూడటం మంచి పద్దతి కాదన్నారు.
రాష్ట్రంలోని సమస్యలు గాలికి వదిలి ముఖ్యమంత్రి, మంత్రులు ఊరేగుతున్నారంటూ ఆరోపించారు కేటీఆర్. సర్పంచుల కుంటుంబాలు రోడ్డున పడే దాకా ప్రభుత్వం స్పందించదా అని ప్రశ్నించారు. శాంతియుత నిరసనకు పిలుపునిచ్చిన సర్పంచులను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని నిలదీశారు.
పల్లె ప్రగతి పేరిట తాము చేపట్టిన కార్యక్రమానికి తూట్లు పొడిచి నిధులు విడుదల చేయకుండా ఆపితే ఎలా అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అరెస్ట్ చేసిన సర్పంచ్ లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు కేటీఆర్.