స్టీరింగ్ కమిటీలో పాల్గొన్న పురంధేశ్వరి
కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రసంగం
ఢిల్లీ – ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ చీఫ్, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి కీలకమైన కామన్వెల్త్ మహిళా పార్లమెంట్ స్టీరింగ్ కమిటీ లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె పలు అంశాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.
భారత దేశంలో తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. ప్రధానంగా ఉక్కు సంకల్పం కలిగిన ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోడీ నాయకత్వంలో అన్ని వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేయడం జరుగుతోందన్నారు ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి.
ఈ సందర్బంగా ప్రధానమంత్రి దార్శనికత, ముందు చూపు ఈ దేశానికి ఎంతో బలాన్ని కలిగించిందన్నారు. ఆయన సారథ్యంలోనే ఇండియా ఇప్పుడు ఎమర్జింగ్ పవర్ తో ముందుకు దూసుకు పోతోందని పేర్కొన్నారు.
తనపై నమ్మకం ఉంచి కామన్వెల్త్ మహిళా పార్లమెంట్ స్టీరింగ్ కమిటీ చర్చల్లో పాల్గొనే అవకాశం కల్పించినందుకు పీఎం నరేంద్ర మోడీకి, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాకు, బీజేపీ చీఫ్ , కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాకు ధన్యవాదాలు తెలిపారు.
ఇదిలా ఉండగా కేంద్ర సర్కార్ ప్రత్యేకించి మహిళలకు ఉద్దేశించిన పథకాల గురించి వివరంగా చర్చించ గలిగినందుకు గర్వంగా ఉందన్నారు ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి.