బ్రహ్మోత్సవాల బుక్ లెట్ రిలీజ్
శ్రీ పద్మావతి అమ్మ వారి ఉత్సవాలు
తిరుపతి – తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మ వారి ఆలయంలో నవంబరు 28 నుండి డిసెంబరు 6వ తేదీ జరుగనున్న కార్తీక బ్రహ్మోత్సవాల రోజు వారి కార్యక్రమాల బుక్ లెట్ ను సోమవారం టీటీడీ ఈవో జె.శ్యామలరావు ఆవిష్కరించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో గల ఈవో కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబరు 28వ తేదీ ధ్వజారోహణంతో ప్రారంభం అవుతాయన్నారు. డిసెంబరు 2వ తేదీన గజవాహనం, డిశెంబరు 3న బంగారు రథం, డిశెంబరు 5న రథోత్సవం, డిశెంబరు 6వ పంచమితీర్ధం వుంటుందని తెలిపారు. భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈవో వీరబ్రహ్మం, డెప్యూటీ ఈవోలు గోవింద రాజన్, ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు.
వాహనసేవల వివరాలు ఇలా ఉన్నాయి. 28న ఉదయం ధ్వజారోహణం, రాత్రి చిన్న శేష వాహనం, 29న ఉదయం పెద్ద శేష వాహనం, రాత్రి హంస వాహనం , 30న ఉదయం ముత్యపు పందిరి వాహనం, రాత్రి సింహ వాహనం, డిసెంబర్ 1న ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి హనుమంత వాహనం ఉంటుందని తెలిపారు జేఈవో.
ఇక 2వ తేదీన ఉదయం పల్లకీ ఉత్సవం, వసంతోత్సవం, రాత్రి గజ వాహనం, 3న ఉదయం
సర్వభూపాల వాహనం , సాయంత్రం స్వర్ణ రథం, రాత్రి గరుడ వాహనం, 4న ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం, 5న ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వ వాహనం, 6న ఉదయం పంచమి తీర్థం , రాత్రి ధ్వజావరోహణం జరుగుతుందని తెలిపారు టీటీడీ జేఈవో వీరబ్రహ్మం.