టెక్నాలజీ పెరిగినా పుస్తకాలకు జనాదరణ
-ఎమ్మెల్సీ కొదండరాం రెడ్డి కామెంట్స్
హైదరాబాద్ – సాంకేతికంగా ప్రపంచ వ్యాప్తంగా కీలకమైన మార్పులు చోటు చేసుకున్నా పుస్తకాలకు వచ్చిన నష్టం ఏమీ లేదని, అంతకంతకూ ఆదరణ పెరుగుతోందే తప్పా తగ్గడం లేదన్నారు హైదరాబాద్ బుక్ ట్రస్ట్ గౌరవ సలహాదారులు, ఎమ్మెల్సీ కోదండరాం రెడ్డి.
టెక్నాలజీ, ఈబుక్స్, ఆన్లైన్ ఎంత పెరిగినా.. పుస్తకాలను చదవడం ఆపడం లేదన్నారు. ఇంటర్నెట్ కాలంలో కూడా పుస్తకాలను చదవే పాఠకులు నిరంతరం పెరుగుతూ ఉంటారని చెప్పారాయన. ప్రెస్ క్లబ్ లో 37వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ గౌరవ సలహాదారులను బుక్ ఫెయిర్ కమిటీ సభ్యులు ప్రకటించారు.
జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండ రాం, సీనియర్ ఎడిటర్ రామచంద్రమూర్తి, ప్రొఫెసర్ రమా మెల్కొటే బుక్ ఫెయిర్ సొసైటీకి గౌరవ సలహాదారులుగా ఉంటారని బుక్ ఫెయిర్ అధ్యక్షులు యాకూబ్ అధ్యక్షతన జరిగిన ఈ మీడియా సమావేశంలో తెలిపారు.
ఈ సందర్భంగా బుక్ ఫెయిర్ కమిటీ సభ్యులతో కలిసి 37వ బుక్ ఫెయిర్ లోగోను ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్సీ కోదండ రామ్, రామచంద్రమూర్తి రమా మెల్కొటే మాట్లాడుతూ.. హైదరాబాద్ బుక్ ఫెయిర్ తెలుగు రాష్ట్రాల్లో గొప్ప మహోత్సవం అని, సాహితీ ప్రియులు, పాఠకులు, విద్యార్థులు, యువత, ఎంతో మంది ఈ పుస్తక మహోత్సవం కోసం వేచి చూస్తుంటారని అన్నారు.
రచయితలను, పాఠకులను కలిపే వేదికగా బుక్ ఫెయిర్ ప్రాముఖ్యత సంతరించుకుందని చెప్పారు. వందలాది పబ్లిషింగ్ సంస్థలు ఈ మహోత్సవంలో పాల్గొంటాయని, ప్రజలు, పాఠకులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
అనంతరం బుక్‌ఫెయిర్ సెక్రటరీ వాసు మాట్లాడారు. డిసెంబర్ 19 నుంచి 29 వరకూ హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించబోయే బుక్ ఫెయిర్‌కు ప్రజలు తరలిరావాలని కోరారు. సందర్శకుల కోసం అనుకూలమైన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.
ప్లాస్టిక్ నిషేధాన్ని పాటిస్తూ.. సందర్శకుల కోసం టికెట్లతో పాటు పుస్తకాల కోసం ‘సంచి’ని ఇస్తామని పేర్కొన్నారు. రచయితలు, పబ్లిషర్లు తమ స్టాళ్లను ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. పది లక్షలకుపై పైగా జనం విజిట్ చేస్తారని తెలిపారు.
విద్యార్థులకు తమ ఐడీ కార్డులతో ఉచిత ప్రవేశం కల్పిస్తున్నామని ఆయన వివరించారు. వివరాల కోసం 9490099081 ను సంప్రదించవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి నారాయణరెడ్డి, వైస్ ప్రెసిడెంట్లు కె. బాల్ రెడ్డి, శోభన్ బాబు, జాయింట్ సెక్రటరీలు కె. సురేశ్, ఎం. సూరిబాబు పాల్గొన్నారు.