NEWSTELANGANA

పార్టీని వీడితే న‌ష్టం లేదు – కేటీఆర్

Share it with your family & friends

కొత్త వాళ్ల‌ను త‌యారు చేసుకుంటాం

సిరిసిల్ల – మాజీ మంత్రి , బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌మ పార్టీ నుంచి కొంద‌రు నేత‌లు వెళ్లి పోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. దీనిపై తీవ్రంగా స్పందించారు. ఆదివారం ఆయ‌న సిరిసిల్లలో పార్టీ స‌మావేశంలో మాట్లాడారు. ఎవ‌రు పార్టీని వీడినా త‌మ‌కు వ‌చ్చే న‌ష్టం ఏమీ లేద‌న్నారు.

ఒక‌వేళ పోతే తాము అడ్డుకునే ప్ర‌స‌క్తి లేద‌ని స్ప‌ష్టం చేశారు. కొత్త నాయ‌కుల‌ను త‌యారు చేసుకుంటామ‌ని చెప్పారు కేటీఆర్. ఆ ద‌మ్ము, ధైర్యం త‌మ‌కు ఉంద‌ని తెలిపారు. కొంద‌రు కావాల‌ని లేనిపోని ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని , వాటిని మానుకుంటే మంచిద‌న్నారు.

కేవ‌లం ఒక్క శాతం ఓట్ల తేడాతో బీఆర్ఎస్ అధికారానికి దూర‌మైంద‌ని పేర్కొన్నారు. అయినా తాము బాధ ప‌డ‌డం లేద‌న్నారు. కానీ దేశంలో ఎక్క‌డా లేని రీతిలో తెలంగాణ‌ను అభివృద్ది చేసిన ఘ‌న‌త ఒక్క బీఆర్ఎస్ కు మాత్ర‌మే ఉంద‌న్నారు. ప్ర‌జ‌లు ఎందుకు అర్థం చేసుకోలేక పోయారోన‌ని వాపోయారు.

ఇక కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల పేరుతో ప్ర‌జ‌ల చెవుల్లో పూలు పెట్టింద‌ని ఎద్దేవా చేశారు. రాబోయే రోజుల్లో పార్టీని ఎండ‌గ‌డతామ‌ని హెచ్చ‌రించారు కేటీఆర్.