జనం గుండె చప్పుడు పరిటాల
ఆయనను మరిచి పోలేం
అనంతపురం జిల్లా – తెలుగుదేశం పార్టీకి చెందిన దివంగత నాయకుడు , మాజీ మంత్రి పరిటాల రవీంద్ర గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు ఏపీ రాష్ట్ర హోం శాఖ, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత వంగలపూడి. మంగళవారం అనంతపురం జిల్లాలో అధికారికంగా పర్యటించారు. ఈ సందర్బంగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఉంటున్న వెంకటాపురం గ్రామానికి వెళ్లారు. అనితకు గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు పరిటాల కుటుంబం.
ఈ సందర్బంగా అనిత వంగలపూడి దివంగత పరిటాల రవీంద్రకు నివాళులు అర్పించారు. అనంతరం పరిటాల కుటుంబంతో పలు అంశాలపై చర్చించారు. ప్రజా నాయకుడు, దీన జనుల , బడుగు జీవులకు ఆత్మ బంధువు పరిటాల రవీంద్ర అని కొనియాడారు.
తమ లాంటి వారికి పరిటాల స్పూర్తిగా నిలుస్తారని పేర్కొన్నారు. చావు తనకు తప్పదని తెలిసినా, తప్పించుకునే మార్గం ఉన్నప్పటికీ తలవంచని ధీరత్వం ప్రజా నాయకుడు పరిటాలది అని ప్రశంసలు కురిపించారు మంత్రి అనిత వంగలపూడి. ఈ లోకం ఉన్నంత దాకా, సూర్య చంద్రులు ఉన్నంత కాలం పరిటాల రవీంద్ర బతికే ఉంటారని, ప్రజల గుండెల్లో భద్రంగా ఉంటారని అన్నారు.