NEWSANDHRA PRADESH

ఏపీ స‌ర్కార్ క‌రెంట్ షాక్ – ష‌ర్మిల

Share it with your family & friends

నిప్పులు చెరిగిన ఏపీపీసీసీ చీఫ్

అమ‌రావ‌తి – ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. విద్యుత్ ఛార్జీలపై గత ప్రభుత్వం చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేయాల్సింది పోయి.. ఆ పాపపు పరిహారాన్ని ప్రజల నెత్తినే మోపాల‌ని చూడ‌టం దారుణ‌మ‌న్నారు.

మంగ‌ళ‌వారం ఎక్స్ వేదిక‌గా స్పందించారు వైఎస్ ష‌ర్మిల‌. రూ.18వేల కోట్ల సర్దుబాటు ఛార్జీలు వసూళ్ళ విషయంలో .. త‌మ‌ తప్పేం లేదని, త‌మ‌కు అస‌లు సంబంధమే లేదని, భారం మాది కాదని చెప్ప‌డం ప‌ట్ల మండిప‌డ్డారు. వైసీపీ చేసింది పాపం అయితే ..ప్ర‌స్తుత కూట‌మి స‌ర్కార్ శాపంగా మారింద‌ని ఫైర్ అయ్యారు వైఎస్ ష‌ర్మిల‌.

గత ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో ప్రజలకు ఏం సంబంధం ? ఎక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేస్తే పడే అదనపు భారం ప్రజల నెత్తిన మోపుతారా ? 5 ఏళ్లలో వైసీపీ భారం రూ.35వేల కోట్లు.. 5 నెలల్లో కూటమి భారం రూ.18 వేల కోట్లా? వైసీపీకి మీకు ఏంటి తేడా ? అని నిప్పులు చెరిగారు ఏపీ పీసీసీ చీఫ్.

వైసీపీ 9సార్లు ఛార్జీలు పెంచిందని, కూటమి అధికారంలో కొస్తే ఒక్క రూపాయి కూడా ఛార్జీలు పెంచమని, అవసరం అయితే 30 శాతం తగ్గించేలా చూస్తాం అని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీలపై కట్టుబడి ఉంటే, తప్పు ఎవరు చేసినా ఆ భారాన్ని ప్రజలపై మోపొద్దనే చిత్తశుద్ది మీకుంటే.. వెంటనే రూ.18 వేల కోట్ల సర్దుబాటు ఛార్జీలను రద్దు చేయాల‌ని ఆమె డిమాండ్ చేశారు.

అధిక క‌రెంట్ బిల్లుల వ‌సూలు చేయ‌డాన్ని నిర‌సిస్తూ మూడు రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళ‌న‌లు చేప‌ట్ట‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి.