రాహుల్ గాంధీ..అశోక్ నగర్ రమ్మంటోంది
ఇదేనా మీ మొహబ్బత్ కా దుకాణ్
హైదరాబాద్ – బీఆర్ఎస్ సీనియర్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డి ఏఐసీసీ మాజీ చీఫ్ , రాయ్ బరేలి ఎంపీ రాహుల్ గాంధీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఎన్నికల సందర్బంగా తమకు ఇచ్చిన హామీలు ఏమై పోయాయని యువతీ యువకులు అడుగుతున్నారని దీనికి మీ వద్ద సమాధానం ఉందా అని ప్రశ్నించారు.
మంగళవారం ఎక్స్ వేదికగా నిలదీసే ప్రయత్నం చేశారు ఏనుగుల రాకేశ్ రెడ్డి. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఓట్లు వేయించుకుని , అధికారంలోకి వచ్చాక వాటి ఊసే ఎత్తడం మరిచి పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేనా ప్రజా పాలన అని మండిపడ్డారు.
హామీలు ఇవ్వడం, వాటిని విస్మరించడం కాంగ్రెస్ పార్టీకి, నేతలకు, సీఎంకు అలవాటుగా మారి పోయిందని ఆరోపించారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో 1,60,000 వేలకు పైగా జాబ్స్ ఇచ్చిందని, కానీ మీరు వచ్చాక కనీసం 20 వేల కొలువులు కూడా ఇవ్వలేక పోయారని ఎద్దేవా చేశారు. 11 నెలల కాలం పూర్తి కావస్తున్నా ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ ఎందుకు ప్రకటించ లేదని ప్రశ్నించారు ఏనుగుల రాకేశ్ రెడ్డి.
మెగా డీఎస్సీ వేస్తామని ఊదరగొట్టారని, ఇప్పుడు దాని గురించి ఎందుకు మాట్లాడటం లేదన్నారు. నిరుద్యోగ యువతీ యువకులకు నెలకు రూ. 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన మాట అప్పుడే మరిచి పోతే ఎలా అని నిలదీశారు బీఆర్ఎస్ నేత. 18 ఏళ్ల బాలికలకు ఎలక్ట్రిక్ బైక్ లు ఇస్తామంటిరి..అదేమైందంటూ రాహుల్ గాంధీని ఉద్దేశించి ప్రశ్నించారు. మోసం చేయడమేనా మొహబ్బత్ కా దుకాణ్ అని ఎద్దేవా చేశారు.