అర్చకులకు సర్కార్ తీపి కబురు – ఆనం
50 వేలు పైబడిన ఆదాయం ఉన్న గుళ్లకు
అమరావతి – ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు కీలక ప్రకటన చేశారు దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి. రాష్ట్రంలో రు.50 వేలు పైబడిన ఆదాయం వున్న దేవాలయాల్లో అర్చకులకు చెల్లించే కనీస వేతనం రు.15,000/- లకు పెంచుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారని దేవదాయ మంత్రి తెలిపారు.
ఈ పెంపువ లన లబ్ధిపొందే అర్చకులు 1,683 మంది వుంటారని పేర్కొన్నారు. కనీస వేతనం నెలకు రు.15,000/- కంటే తక్కువ పొందుతున్న అర్చకులకు కొత్త వేతనం కింద రు. 15,000/- చెల్లిస్తే దేవదాయశాఖకు రు.10 కోట్ల వరకు అదనపు వ్యయం అవుతుందని వెల్లడించారు.
ఇందులో కొంత భాగాన్ని సి.జి.ఎఫ్. నుంచి చెల్లిస్తామని తెలిపారు మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి. మొత్తం లబ్దిపొందే అర్చకుల సంఖ్య 3,203 అని మంత్రి తెలిపారు. దేవదాయశాఖ 1987 (30 సెక్షన్) లోని 70వ సెక్షన్ను అనుసరించి అర్చకులకు చెల్లించే కనీస వేతనాన్ని దేవదాయశాఖ భరిస్తుందన్నారు.
ఎన్నికల ప్రణాళికలో బ్రాహ్మణులకు, ఇతర వర్గాలకు, అర్చకులకు, వేద పండితులకు, వేదాధ్యయన విద్యార్థులకు ఇచ్చిన నిరుద్యోగ భృతితో సహా ఎన్నికల ప్రణాళికలోని అన్ని అంశాలను అమలు చేసిన ఏకైక శాఖ దేవదాయశాఖ మాత్రమేనని దేవదాయశాఖ మంత్రి స్పష్టం చేసారు.
దేవాలయాలకు సంబంధించి, అర్చకులకు సంబంధించి ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలను తమ శాఖ అమలు చేయడంలో ముఖ్యమంత్రి సహకారం మరువలేనిదని, అందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని మంత్రి రామనారాయణ రెడ్డి తెలిపారు.