గులాబీ బాస్ పై కాంగ్రెస్ కన్నెర్ర
రాహుల్ గాంధీపై కామెంట్స్ తగదు
హైదరాబాద్ – తమ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, ఏఐసీసీ మాజీ చీఫ్, రాయ్ బరేలి ఎంపీ రాహుల్ గాంధీ గురించి బీఆర్ఎస్ పార్టీ ఎక్స్ వేదికగా చేసిన కామెంట్స్ పై తీవ్రంగా స్పందించింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ (టీపీసీసీ). బుధవారం ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రతిపక్ష నాయకుడి పాత్ర పోషించాల్సిన మాజీ సీఎం కేసీఆర్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించింది.
నిరాధారమైన ఆరోపణలు చేయడం, విమర్శలు గుప్పించడం ఎంత వరకు సబబు అని మండిపడింది. ఇలాంటి చిల్లర మల్లర రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికింది. దేశ్ కీ నేత అంటూ ప్రచారం చేసుకున్న బీఆర్ఎస్ ఇప్పుడు ఏం చేస్తోందంటూ నిలదీసింది కాంగ్రెస్ పార్టీ. ఫాం హౌస్ లో నిద్ర పోతున్నాడా మీ అధినేత అంటూ ఎద్దేవా చేసింది. లిక్కర్ దందా కేసులో ఇరుక్కుని ఇటీవలే బెయిల్ పై విడుదలైన కవిత నిద్ర పోతోందా అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.
రబ్బరు చెప్పుల అగ్గిపెట్టె, డ్రామా రావు యధావిధిగా వారి వాగుడుతో జనాలను ఆగం పట్టిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది కాంగ్రెస్ పార్టీ. అసెంబ్లీ ఎన్నికల్లో బోర్లా పడి, పార్లమెంట్ ఎన్నికల్లో సమాధి అయిన బీఆర్ఎస్ పార్టీలో మిగిలిన నేతలు ఇలా పొగరుబోతు మాటలు మాట్లాడితే ఎలా అని ఫైర్ అయ్యింది. తెలంగాణ పేరుతో ఉన్న వనరులను కొల్లగొట్టి, అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా సంపాదించి దాచుకున్నదంతా కక్కిస్తామని హెచ్చరించింది.