తల్లికి కొడుకు కాకుండా పోతాడా
వైఎస్ విజయలక్ష్మి కామెంట్స్
అమరావతి – దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మ కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆమె ఎక్స్ వేదికగా వీడియో సందేశం పోస్ట్ చేశారు.
కుటుంబం అన్నాక భేదాభిప్రాయాలు ఉంటాయని, అలాగని కొట్లాడుకుంటామా అని ప్రశ్నించారు. తనకు సంబంధించిన కొన్ని వీడియోలను పనిగట్టుకుని తిరిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం దారుణమన్నారు వైఎస్ విజయమ్మ.
నిరాధారమైన ఆరోపణలు చేయడం సరైన విధానం కాదని హితవు పలికారు. చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉండొచ్చు.. అంత మాత్రాన తల్లికి కొడుకు కాకుండా పోతాడా అని ప్రశ్నించారు. చవకబారు విమర్శలు చేయడం మానుకోవాలని స్పష్టం చేశారు వైఎస్ విజయమ్మ.
ఇదిలా ఉండగా తాను రాసిన లేఖల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. రెండు లేఖలు రాశానని, అవి వేరే వారు రాయలేదని, తాను మాత్రమే రాశానని పేర్కొన్నారు. నకిలీ లేఖలు రావాల్సిన అవసరం తనకు కానీ, తన కొడుకు జగన్ రెడ్డికి లేదన్నారు.
భేదాభిప్రాయాలు ఉన్నంత మాత్రాన అవి కొద్ది సేపు మాత్రమేనని పేర్కొన్నారు. ఇక వాటికి పుల్ స్టాప్ పెట్టాలని కోరారు వైఎస్ విజయమ్మ.