NEWSTELANGANA

కుటుంబ స‌ర్వేలో టీచ‌ర్లు ఎందుకు..?

Share it with your family & friends

అటకెక్కిన విద్యా రంగం అంటూ ఫైర్

హైద‌రాబాద్ – మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు సీఎం రేవంత్ రెడ్డికి బ‌హిరంగ లేఖ రాశారు. రాష్ట్ర స‌ర్కార్ తలపెట్టిన “సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే” కోసం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల సేవలను వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించడం విద్య హక్కు చట్టం ఉల్లంఘన అని పేర్కొన్నారు.

36,559 ఎస్జీటీలను, 3414 మంది ప్రధానోపాధ్యాయులను ఈ సర్వేలో భాగం చేస్తూ విద్యాశాఖ విడుదల‌ చేసిన ఉత్తర్వులు నిబంధనలకు విరుద్ధమ‌ని అన్నారు హ‌రీశ్ రావు. ఉదయం 9 గంటల నుండి మ. 1 గంటల వరకే (ఒంటి పూట) పాఠశాలలు నిర్వహించాలనేది ఈ ఉత్తర్వుల సారాంశంగా కనిపిస్తున్నది.

మీ పాలన పుణ్యమా అని ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలపై ఉన్న నమ్మకం రోజురోజుకీ దిగజారుతున్నదని వాపోయారు.. మీ నిర్లక్ష్యం, అనాలోచిత నిర్ణయాలు విద్యార్థులు, తల్లిదండ్రులకు తోడు ఉపాధ్యాయులకు శాపాలుగా మారుతున్నాయని ఆరోపించారు త‌న్నీరు హ‌రీశ్ రావు. ఇప్పుడు కుటుంబ సర్వే పేరుతో టీచర్లు, విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తూ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని మండిప‌డ్డారు.

విద్యాహక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయులను జనాభా గణన లెక్కలు, ప్రకృతి వైపరీత్యాలలో సహాయ విధులు, పార్లమెంటు, రాష్ట్ర శాసన సభ, స్థానిక ప్రభుత్వాలకు జరిగే ఎన్నికలకు సంబంధించిన విధులకు మాత్రమే వినియోగించాలని స్పష్టం చేస్తుందని తెలిపారు.

ఇవి కాకుండా మరే ఇతర పనులకు వినియోగించ కూడదని విద్యా హక్కు చట్టం నిర్దేశిస్తుందని పేర్కొన్నారు. ఈ నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం కుల గణన కోసం ఉపాధ్యాయులను వినియోగించు కోవడం విద్యా హక్కు చట్ట ఉల్లంఘన కిందికి వస్తుందన్నారు.

ప్రభుత్వ బడులలో చదివే పిల్లల తల్లిదండ్రులు అత్యధిక శాతం కూలి నాలి చేసుకునే వారే ఉన్నార‌ని, అకస్మాత్తుగా ఒంటి పూట బడులు నడపడం వలన పిల్లలకే కాకుండా తల్లిదండ్రులకు కూడా ఇబ్బందులు ఉంటాయని తెలిపారు. పిల్లల చదువులు కుంటు పడటంతో పాటు వారి భవిష్యత్తుపై ప్రభావం పడుతుందన్నారు.

విద్యా హక్కు చట్టాన్ని దృష్టిలో ఉంచుకొని సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నుండి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులను మినహాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.