NEWSANDHRA PRADESH

ఎమ్మెల్సీ అభ్య‌ర్థిగా వెంక‌ట చిన అప్ప‌ల‌నాయుడు

Share it with your family & friends

ఎంపిక చేసిన వైసీపీ చీఫ్ జ‌గన్ మోహ‌న్ రెడ్డి

తాడేప‌ల్లిగూడెం – వైసీపీ బాస్, ఏపీ మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వైయస్సార్‌సీపీ అభ్యర్థిగా సీనియర్‌ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడును ప్ర‌క‌టించారు. బుధ‌వారం క్యాంపు కార్యాలయంలో విజయనగరం జిల్లా నేతలతో స‌మావేశం జ‌రిగింది. ఈ సంద‌ర్బంగా ఈ విష‌యం వెల్ల‌డించారు.

పార్టీ నాయకులతో వారందరి అభిప్రాయాలను తీసుకున్నారు. పార్టీ నాయకులు వ్యక్తం చేసిన ఏకాభిప్రాయం మేరకు అప్పల నాయుడు పేరును ప్రకటిస్తున్నట్టు వైయస్‌.జగన్‌ వెల్లడించారు. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత బొత్సకు అవకాశం ఇచ్చిన దృష్ట్యా, ఈసారి వెలమ సామాజిక వర్గానికి చెందిన అప్పల నాయుడు పేరును పార్టీ నేతలంతా బల పరిచినందున ఈ నిర్ణయం తీసుకున్నామని వైయస్‌.జగన్ అన్నారు.

అనుభవం, సామాజిక వర్గం రీత్యా అప్పల నాయుడు పేరును ప్రకటించామన్నారు. అప్పల నాయుడు అనుభవజ్ఞుడు, సీనియర్ అయినందున అందరి గౌరవాన్ని పొందుతారన్నారు. సమిష్టి కృషితో విశాఖపట్నం ఎమ్మెల్సీ స్థానాన్ని చేజిక్కించుకున్నామని, విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీని కూడా అదే స్ఫూర్తితో గెలుచుకోవాలని పార్టీ నేతలకు వైయస్‌.జగన్‌ పిలుపునిచ్చారు.

విజయనగరం జిల్లాల్లో స్థానిక సంస్థలకు చెందిన మొత్తం ప్రతినిధుల సంఖ్య 753 అని, ఇందులో 592 మంది వైయస్సార్సీపీ స్థానిక సంస్థల ప్రతినిధులుగా గెలుపొందిన వారు ఉన్నారని తెలిపారు. పార్టీ అభ్యర్థి చిన అప్పల నాయుడు సుమారు నాలుగు దశాబ్దాలుగా ప్రజా జీవితంలో ఉండి కొనసాగుతున్నారు. బొబ్బిలి నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన శంబంగి వెంకట చిన అప్పల నాయుడు 2019లో ప్రొటెం స్పీకర్‌గా కూడా పని చేశారు..