చంద్రబాబుకు రుణపడి ఉన్నా – చైర్మన్
టీటీడీ పదవి ఆయన పుణ్యమేనని కామెంట్
తిరుపతి – తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ధర్మకర్తల మండలి నూతన చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన బీఆర్ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. అత్యున్నతమైన పదవిని కట్టబెట్టినందుకు తాను ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు రుణపడి ఉన్నానని అన్నారు. చైర్మన్ ప్రమాణ స్వీకారం అనంతరం తొలిసారిగా మీడియాతో మాట్లాడారు.
టీటీడీలో ఎన్నో మార్పులు తీసుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. సామాన్య భక్తుల కోసం తీసుకునే నిర్ణయాలకు బోర్డు సభ్యుల సహకారం అవసరం అని స్పష్టం చేశారు బీఆర్ నాయుడు. ప్రస్తుతం పాలక మండలికి ఎన్నో సవాళ్ళు ఉన్నాయని చెప్పారు.
తిరుమల పవిత్రతను కాపాడు కోవాల్సిన అవసరం ఉందన్నారు. సామాన్య భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించే ప్రయత్నం చేస్తామన్నారు టీటీడీ చైర్మన్. గత నెల జరిగిన బ్రహ్మోత్సవాలను బ్రహ్మాండంగా నిర్వహించారని ప్రశంసలు కురిపించారు.
బ్రహ్మోత్సవాలను దిగ్విజయంగా నిర్వహించిన టిటిడి ఉన్నతాధికారులకు ధన్యవాదాలు చెబుతున్నాను అని అన్నారు. టీటీడీలో పర్మినెంట్ ఉద్యోగుల సంఖ్య తగ్గుతోందన్న విషయంపై టిటిడి ఉన్నతాధికారులతో చర్చిస్తానని చెప్పారు బీఆర్ నాయుడు.
శ్రీవాణి ట్రస్టుపై భక్తుల్లో ఎన్నో అపోహలు ఉన్నాయని, దీనిపై విచారణ జరుగుతోందని చెప్పారు. దీనిపై త్వరలోనే సీఎంతో చర్చిస్తామన్నారు.