ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాల పేరు మార్పు
డాక్టర్ ఎల్లా ప్రగడ సుబ్బారావుగా మార్చిన సర్కార్
అమరావతి – ఏపీ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాల పేరును దివంగత డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు ప్రభుత్వ వైద్య కళాశాల గా మారుస్తున్నట్లు స్పష్టం చేసింది.
ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త గా డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గౌరవార్థం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రతిపాదనను ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సందర్బంగా ఆయనకు ధన్యవాదాలు తెలిపారు ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్.
ఇదిలా ఉండగా 1895లో పశ్చిమగోదావరి జిల్లా భీముని పట్నంలో జన్మించారు ఎల్లాప్రగడ సుబ్బారావు . ఆయన 1948లో మరణించారు. జీవిత పర్యంతం డా. సుబ్బారావు బయో కెమిస్ట్రీ విభాగంలో చేసిన పరిశోధనలు ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది జీవితాలను సంరక్షించటంలో సహాయపడ్డాయి.
వారి మార్గదర్శక పరిశోధనల కారణంగా హెట్రోజెన్, టెట్రాసైక్లిన్ వంటి క్లిష్టమైన యాంటీ బయోటిక్స్ ప్రపంచానికి అందాయి. ఫోలిక్ యాసిడ్ స్వభావం, లక్షణాల గురించి వారి ఆవిష్కరణలు ఓ మార్గదర్శక పురోగమనానికి బాటలు వేశాయి.
మానవాళి సంక్షేమం కోసం తమ జీవితాలను అంకితం చేసిన మహనీయుల స్మృతికి, వారసత్వానికి శాశ్వతత్వం కల్పించే దిశగా కూటమి ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు సత్య కుమార్ యాదవ్. ఇదే స్ఫూర్తితో ఇటీవల మచిలీపట్నం వైద్యకళాశాలకు స్వాతంత్ర సమర యోధుడు, జాతీయజెండా రూపశిల్పి పింగళి వెంకయ్య పేరిట నామకరణం చేశామన్నారు.