నా డిఎన్ఏ ఏమిటో ప్రజలకు తెలుసు
కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి
హైదరాబాద్ – కేంద్ర గనుల శాఖ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన గురించి లేనిపోని ఆరోపణలు, విమర్శలు చేస్తున్న వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. తన జీవితం తెరిచిన పుస్తకం అని స్పష్టం చేశారు. శుక్రవారం ఎక్స్ వేదికగా స్పందించారు. ఎవరు ఏమన్నా తాను పట్టించుకోనని పేర్కొన్నారు.
తాను కింది స్థాయి నుంచి వచ్చిన వాడినని, కార్యకర్తగా, నాయకుడిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా తనను ప్రజలు ఆదరిస్తూ వచ్చారని, పార్టీ అభివృద్ది కోసం తాను శక్తి వంచన లేకుండా కృషి చేశానని అన్నారు. తెలంగాణ ఉద్యమ కాలంలో సైతం తాను ఎక్కడ ఉన్నాననో, ఎవరి వైపున నిలబడ్డానో ప్రజలందరికీ తెలుసన్నారు.
తన డిఎన్ఏ ఏమిటనేది తెలంగాణ బిడ్డలందరికీ తెలుసన్నారు. ఒకరిపై మాట్లాడే ముందు ముందు వెనుకా ఆలోచించుకుని మాట్లాడాలని హితవు పలికారు. రాజకీయాలలో ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. చిల్లర మల్లర మాటల వల్ల ప్రజల్లో చులకనై పోతామని గుర్తు పెట్టుకోవాలన్నారు గంగాపురం కిషన్ రెడ్డి.
ఇదే సమయంలో మూసీపై స్పందించారు. మూసీ ప్రక్షాళన చేయాల్సిందే, నీళ్లు ఇవ్వాల్సిందే.. కృష్ణా, గోదావరి నుంచి నీళ్లు తీసుకొచ్చినా అభ్యంతరం లేదన్నారు. ఒక్క ఇల్లు కూలగొట్టినా ఊరుకునేది లేదని హెచ్చరించారు.