జగన్ రెడ్డి షాకింగ్ కామెంట్స్
తిరిగి పవర్ లోకి వస్తాం
అమరావతి – వైఎస్సార్సీపీ చీఫ్, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఏపీలో కొలువు తీరిన టీడీపీ కూటమి సర్కార్ పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపించారు. ఎక్స్ వేదికగా స్పందించారు. రాష్ట్రంలో పూర్తిగా లా అండ్ ఆర్డర్ గాడి తప్పిందని ఆవేదన చెందారు. ప్రధానంగా తమ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలను కావాలని లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు జగన్ రెడ్డి.
కూటమిలో ఏ మంత్రి ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదన్నారు. తాము ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను కావాలని అమలు చేయడం లేదంటూ ధ్వజమెత్తారు . ఇది మంచి పద్దతి కాదన్నారు. త్వరలోనే జమిలి ఎన్నికలు రాబోతున్నాయని జోష్యం చెప్పారు.
100 రోజుల కూటమి పాలనలో 100 అత్యాచారాలు జరగడం బాధాకరమని అన్నారు. ప్రజలకు రక్షణ కల్పించ లేని ప్రభుత్వం ఉన్నా లేనట్టేనంటూ ఎద్దేవా చేశారు. విచిత్రం ఏమిటంటే బాధ్యత కలిగిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లా శాంతి భద్రతల సమస్య ఇంకా అలాగే ఉందని అనడం మీ పనితీరును తెలియ చేస్తుందన్నారు జగన్ రెడ్డి.
అధికార పార్టీ అండ చూసుకుని కొందరు పోలీసులు రెచ్చి పోతున్నారని , తాము త్వరలో పవర్ లోకి వస్తామని, రిటైర్ అయినా సదరు ఖాకీలను వదిలి పెట్టే ప్రసక్తి లేదంటూ హెచ్చరించారు వైసీపీ బాస్.