NEWSTELANGANA

పాద‌యాత్ర కాదు పాప‌పు యాత్ర – రాకేశ్ రెడ్డి

Share it with your family & friends

సీఎం రేవంత్ రెడ్డిపై షాకింగ్ కామెంట్స్

హైద‌రాబాద్ – బీఆర్ఎస్ సీనియ‌ర్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. శుక్ర‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఇవాళ పాద‌యాత్ర చేప‌ట్ట‌డంపై మండిప‌డ్డారు. సీఎం చేయాల్సింది పాద‌యాత్ర కాద‌ని ఇచ్చిన మాట త‌ప్పినందుకు బాధ్య‌త వ‌హిస్తూ యాదాద్రి ల‌క్ష్మి న‌ర‌సింహ స్వామి వ‌ద్ద‌కు మోకాళ్ల యాత్ర చేప‌డితే బెట‌ర్ అని సూచించారు ఏనుగుల రాకేశ్ రెడ్డి.

త‌ను చేస్తున్న‌ది పాద‌యాత్ర కాద‌ని పాప‌పు యాత్ర అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దీనికి బ‌దులు ఇచ్చిన హామీలు అమ‌లు చేయ‌నందుకు గాను ప‌శ్చాతం వ్య‌క్తం చేస్తూ యాత్ర చేప‌ట్టాల‌ని డిమాండ్ చేశారు.

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో తెలంగాణా ప్రజలకు ప్రతినిధి గా ఉంటూ ఆగస్టు 15 లోగా రుణమాఫీ చేస్తా అని ఏకంగా లక్ష్మి నరసింహ స్వామి మీద ఒట్టేసిండని ..కానీ దానిని అమ‌లు చేయ‌లేదని ఆరోపించారు.

రాజ్యాన్ని పాలించే రాజు ఒట్టేసే మాట తప్పితే ఆ ప్రభావం, ధైవాగ్రహం ప్రజల మీద పడుతుంద‌ని అన్నారు. దీని కార‌ణంగా తెలంగాణ‌లో ఆల‌స్యంగా వ‌ర్షాలు ప‌డ్డాయ‌ని, ములుగు అడవులు కూడా ఎన్నడూ జరగని విధంగా విధ్వంసం అయ్యాయని ఆరోపించారు. ధామగుండం లో చెట్లు పోతున్నాయ‌ని వాపోయారు.

రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ నాశనం అయ్యింద‌ని, రియల్ ఎస్టేట్ రంగం, వ్యాపారాలు, కొనుగోలు అమ్మకాలు ఎక్కడిక్కడ ఆగి పోయాయని ఆరోపించారు ఏనుగుల రాకేశ్ రెడ్డి. మూసీ పేరుతో హైద‌రాబాద్ లో ఇళ్లు కూల్చేసి వ‌లిగొండ‌లో పాద‌యాత్ర చేస్తే ఎలా అని ప్ర‌శ్నించారు.

సీఎం పాదయాత్ర చేయాల్సింది రైతుల కల్లాల కాడికి, ఛిద్రమైన పోచంపల్లి చేనేతల మగ్గాల కాడికి, నిత్యం ఆసుపత్రుల పాలవుతున్న గురుకుల విద్యార్థుల దగ్గరకి అని అన్నారు. సీఎంకు ద‌మ్ముంటే సెక్యూరిటీ లేకుండా పాద‌యాత్ర చేప‌ట్టాల‌ని డిమాండ్ చేశారు ఏనుగుల రాకేశ్ రెడ్డి.