NEWSTELANGANA

మెఘా కృష్ణారెడ్డిని అరెస్ట్ చేసే ద‌మ్ముందా..?

Share it with your family & friends

సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ స‌వాల్

హైద‌రాబాద్ – బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. శుక్ర‌వారం ఎక్స్ వేదిక‌గా తీవ్రంగా స్పందించారు. రాష్ట్ర ముఖ్య‌మంత్రి అనుముల రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. తాను ఎక్క‌డికీ పారి పోలేద‌ని స్ప‌ష్టం చేశారు. సీఎంకు అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్న మీడియా కావాల‌ని త‌న‌ను బ‌ద్నాం చేసేందుకు ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని ఆరోపించారు.

ఇదే క్ర‌మంలో నిన్న రాత్రి తాను మలేషియాకు పారి పోయిన‌ట్లు రాశార‌ని, అది పూర్తిగా అబ‌ద్ద‌మ‌ని పేర్కొన్నారు. నీకు గానీ లేదా నీకు సంబంధించిన ఏజెన్సీలు ఏవైనా ఉంటే త‌న వ‌ద్ద‌కు రావాల‌ని సవాల్ విసిరారు. ముందు త‌న‌ను కాదు అరెస్ట్ చేయాల్సింది మేఘా కృష్ణా రెడ్డిని అని అన్నారు.

రేవంత్ రెడ్డీ..నా అరెస్ట్ కోసం ఉవ్విళ్లూర‌డం ఆపు చేసి ముందు మెఘా కృష్ణా రెడ్డిని సుంకిసాల ఘ‌ట‌న‌లో బ్లాక్ లిస్టు లో పెట్టే సాహ‌సం చేయ‌గ‌ల‌వా అని ప్ర‌శ్నించారు. పోనీ ఆయ‌న‌ను అరెస్ట్ చేసే స‌త్తా నీకు ఉందా అని నిల‌దీశారు.

దమ్ముందా ఆ ‘ఆంధ్రా కాంట్రాక్టర్‌’ని తన ‘ఈస్ట్ ఇండియా కంపెనీ’ని కొడంగల్‌ లిఫ్ట్ ఇరిగేషన్‌ నుండి తీసి వేయడానికి అని కేటీఆర్ నిప్పులు చెరిగారు. సీఎం అయి ఉండి మేఘాకు గులాంగిరీ చేయ‌డం దారుణ‌మ‌న్నారు.