యాదగిరిగుట్టగా మార్చండి – సీఎం
రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం
నల్లగొండ జిల్లా – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ . రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం ఆయన పుట్టిన రోజు సందర్బంగా యాదగిరిగుట్టను సందర్శించారు. పూజారులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్బంగా లక్ష్మీ నరసింహ స్వామి వారికి పూజలు చేశారు. అనంతరం యాదగిరిగుట్ట ఆలయ అధికారులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. కీలక ఆదేశాలు జారీ చేశారు.
యాదాద్రి అనే పేరు తీసి వేయాలని , వెంటనే ఆ పేరు ఉండేందుకు వీలు లేదని స్పష్టం చేశారు అనుముల రేవంత్ రెడ్డి. యాదాద్రి స్థానంలో యాదగిరిగుట్ట అనేది ఉండాలని ఆదేశించారు. ఏ మాత్రం తేడా వచ్చినా ఊరుకునేది లేదన్నారు. ఈ ఆదేశాలు వెంటనే అమలులోకి వస్తాయని అన్నారు సీఎం.
ఇదే క్రమంలో భక్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. మొక్కులు తీర్చుకునేందుకు కొండ పైకి రాక పోవడం ఏమిటని ప్రశ్నించారు. గతంలో లాగేనా కొండ పైన నిద్రించేలా చూడాలని అన్నారు.
ఇదే సమయంలో తిరుపతి బోర్డు తరహాలో యాదగిరిగుట్ట ఆలయానికి సంబంధించి బోర్డు ఉండాలని, ఇందుకు సంబంధించి విధి విధానాలతో తన వద్దకు రావాలని ఆలయ అధికారులను ఆదేశించారు.