10 ఏళ్ల పాటు నిరీక్షించా – సంజూ శాంసన్
సెంచరీ తర్వాత డర్బన్ లో స్టార్ క్రికెటర్
దక్షిణాఫ్రికా – సౌతాఫ్రికాతో జరిగిన టి20 తొలి మ్యాచ్ లో అద్భుతంగా ఆడి రికార్డ్ సృష్టించాడు కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్. కేవలం 50 బంతులు మాత్రమే ఎదుర్కొన్న శాంసన్ 107 పరుగులు చేశాడు. ఇందులో 7 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. సఫారీ బౌలర్లను ఊచకోత కోశాడు. భారత క్రికెట్ జట్టులో టి20 ఫార్మాట్ లో వరుసగా రెండు సెంచరీలు చేసిన ఏకైక బ్యాటర్, వికెట్ కీపర్ సంజూ శాంసన్ కావడం విశేషం.
ఈ సందర్బంగా మ్యాచ్ అనంతరం స్కిప్పర్ సూర్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ శాంసన్ అందరిలాంటి ఆటగాడు కాదన్నాడు. తను తన కోసం ఆడడని, తన రికార్డుల కోసం చూడడని, కేవలం జట్టును దృష్టిలో పెట్టుకుని ఆడతాడని అందుకే తనంటే ఇష్టమన్నాడు.
ఇదే సమయంలో సెంచరీతో రికార్డ్ బ్రేక్ చేసిన సంజూ శాంసన్ మాట్లాడుతూ ఇలా ఆడడానికి కనీసం 10 ఏళ్లు పట్టిందన్నాడు. పడుతూ లేస్తూ వచ్చానని , అయినా ఎప్పుడు ఏది జరగాలో అప్పుడే జరుగుతుందన్నాడు సంజూ శాంసన్. ప్రస్తుతం అద్భుతమైన ఫామ్ తో దుమ్ము రేపిన సంజూ శాంసన్ పై ప్రశంసలు కురుస్తున్నాయి.
ఇదిలా ఉండగా ఈ మ్యాచ్ లో భారత జట్టు 61 పరుగుల భారీ తేడాతో ఆతిథ్య జట్టు దక్షిణాఫ్రికాను ఓడించింది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించాడు సంజూ శాంసన్. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు పొందాడు.