టీటీడీ చైర్మన్ కు జీయర్ ఆశీర్వాదం
గోశాలను సందర్శించిన బీఆర్ నాయుడు
తిరుమల – తిరుమలలోని ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం, ఎస్వీ గోశాలను టిటిడి ధర్మకర్తల మండలి చైర్మన్ బిఆర్ నాయుడు సందర్శించారు.
ధర్మగిరికి తొలిసారిగా వచ్చిన సందర్భంగా ప్రిన్సిపాల్ కెఎస్ఎస్ అవధాని టిటిడి ఛైర్మన్ కు వేద మంత్రోచ్ఛారణలు నడుమ వేదాశీర్వచనం నిర్వహించి సంప్రదాయ పూర్వకంగా స్వాగతం పలికారు.
అనంతరం విద్యార్థులతో బీఆర్ నాయుడు మాట్లాడారు. విద్యార్థులందరూ తమ కోర్సులలో నైపుణ్యం సాధించి సనాతన ధర్మాన్ని ప్రబోధించాలని కోరారు.
”ఏదైనా సమస్యలు ఉన్నట్టయితే తాము పరిష్కరిస్తామని, మరోసారి విద్యార్థులందరిని కలుస్తానన్నారు. సనాతన ధర్మాన్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్ళాలన్నదే తమ ఉదాత్తమైన సంకల్పమని ఆయన పేర్కొన్నారు.
తొలుత ధర్మగిరి ప్రధానోపాధ్యాయులు తిరుమలలో వైదిక సంస్థ ఆవిర్భావం, ప్రాభవం గురించి టీటీడీ ఛైర్మన్ కి వివరించారు.
ప్రత్యేక అధికారి ధర్మగిరి విజయలక్ష్మి, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మధుసూదన ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
అనంతరం టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు గోశాలను సందర్శించి నవనీత సేవలో పాల్గొన్నారు.
నవనీత సేవలో శ్రీవారి సేవకులు చేస్తున్న సేవలను ఆయన పరిశీలించారు, ఏకాంత సేవకు వినియోగించే వెన్నను తయారు చేసే విధానాన్ని పరిశీలించారు, గోపూజలో కూడా ఛైర్మన్ పాల్గొన్నారు. ఎస్వీ గోసాల డైరెక్టర్ డాక్టర్ హరనాథ్ రెడ్డి కూడా పాల్గొన్నారు.
పెద్ద జీయర్ మఠాన్ని టిటిడి ఛైర్మన్ సందర్శించారు. శ్రీ పెద్ద జీయర్ స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం అఖిలాండంలో శ్రీ బేడి ఆంజనేయ స్వామికి పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టారు.