NEWSTELANGANA

ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్ అక్ర‌మం – హ‌రీశ్

Share it with your family & friends

పోలీసుల దాడి చేయ‌డం దారుణం

హైద‌రాబాద్ – మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు నిప్పులు చెరిగారు. శ‌నివారం శాంతియుతంగా హుజూరాబాద్ చౌర‌స్తాలో అంబేద్క‌ర్ సాక్షిగా శాంతియుతంగా ఆందోళ‌న చేప‌ట్టిన త‌మ పార్టీకి చెందిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయ‌డం ప‌ట్ల ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆయ‌న ఎక్స్ వేదిక‌గా స్పందించారు. ఇది పూర్తిగా అప్ర‌జాస్వామిక‌మ‌ని పేర్కొన్నారు. రాష్ట్రంలో పోలీసు పాలన సాగుతోంద‌ని ఆరోపించారు.

ప్ర‌జా ప్ర‌తినిధిని ప‌ట్టుకుని పోలీసులు దాడి చేయ‌డాన్ని తీవ్రంగా ఖండిస్తున్న‌ట్లు తెలిపారు త‌న్నీరు హ‌రీశ్ రావు. దళిత బంధు లబ్ధిదారులకు రెండో విడత ఆర్థిక సహాయం చెల్లించాలని కోరడమే కౌశిక్ రెడ్డి చేసినా తప్పా అని ప్ర‌భుత్వాన్ని, సీఎం రేవంత్ రెడ్డిని సూటిగా ప్ర‌శ్నించారు.

ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు ప్రజాప్రతినిధి అని కూడా చూడకుండా ఇంత కర్కశంగా వ్యవహరిస్తారా? అని ఫైర్ అయ్యారు త‌న్నీరు హ‌రీశ్ రావు. ఇది ప్రజా పాలన కాదని, రేవంత్ మార్కు రాక్షస పాలన, కాంగ్రెస్ మార్కు నిరంకుశ పాలన, ఇందిరమ్మ ఎమర్జెన్సీ నాటి నిర్బంధ పాలన అని ధ్వ‌జ‌మెత్తారు.

అస్వస్థతకు గురై ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న త‌మ‌ ఎమ్మెల్యే ఆరోగ్యం, భద్రత.. పట్ల పూర్తి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదేన‌ని హెచ్చ‌రించారు.

అరెస్ట్ చేసిన బిఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని
బి ఆర్ ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నామ‌ని అన్నారు హ‌రీశ్ రావు.