బాల సదనం తనిఖీ చేసిన నేరెళ్ల శారద
సఖి కేంద్రాన్ని సందర్శించిన చైర్ పర్సన్
యాదాద్రి భువనగిరి జిల్లా – తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద శనివారం ఆకస్మికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని బాల సదనం ను తనిఖీ చేశారు. అనంతరం సఖీ కేంద్రాన్ని పరిశీలించారు. కీలక వ్యాఖ్యలు చేశారు. బాల సదనంతో పాటు సఖి కేంద్రాల నిర్వహణకు సంబంధించి పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయని ఈ మేరకు తాను రావడం జరిగిందని తెలిపారు నేరెళ్ల శారద.
ఇటీవలి కాలంలో పలు సంఘటనలు తన దృష్టికి రావడంతో , నేరుగా పిల్లలతో వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు. గుర్తించిన సమస్యలను పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద.
సఖి సెంటర్ నిర్వహణ , టోల్ ఫ్రీ నంబర్ పైన విస్తృత అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు నివేదికలు తయారు చేయాలని ఆదేశించారు. విధి నిర్వహణలో అలసత్వం వహించినా లేదా నిర్లక్ష్యం వహించినా సహించేది లేదని హెచ్చరించారు తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్.