రాష్ట్రంలో మరిన్ని సీ ప్లేన్ లు – కందుల దుర్గేష్
పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తామని ప్రకటన
విజయవాడ – జల మార్గం ద్వారా ఆకాశమార్గంలో పయనించే సీప్లేన్ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవటం సంతోషంగా ఉందని అన్నారు ఏపీ రాష్ట్ర పర్యాటక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్. శనివారం విజయవాడ ఘాట్ వద్ద సీ ప్లేన్ డెమోను సీఎం నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఈ సందర్బంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడారు.
పర్యాటకులకు మధురానుభూతిని కలిగించే సీప్లేన్లు త్వరలోనే మరిన్ని ప్రాంతాల్లో ప్రవేశ పెట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. టూరిజం సర్క్యూట్ల ద్వారా రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.
దేవాలయ దర్శనంతో పాటు ప్రకృతి సౌందర్యంలో ప్రయాణికుడు విహరించేలా ప్రణాళికలు తయారు చేస్తామన్నారు. ఏకకాలంలో అభివృద్ధిని, సంక్షేమాన్ని సమ్మిళితం చేసి ముందుకు నడిపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీర్తి కిరీటంలో సి ప్లేన్ ప్రారంభోత్సవ కార్యక్రమం మరో కలికితురాయి అని అన్నారు కందుల దుర్గేష్.
అధికారంలోకి వచ్చినటువంటి నాలుగు నెలల కాలంలోనే చంద్రబాబు నాయుడు నిరంతరం అనేక సంస్కరణలు చేపడుతూ ఒక పక్కన పేద ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తూ మరో పక్కన అభివృద్ధిలో రాష్ట్రాన్ని ముందుకు పరుగులు తీయిస్తున్నారని అన్నారు.
ఇప్పటి వరకు జలయానం, ఆకాశయానం చేశామని ఇవాళ కొత్తగా ద్విగుణీకృతమైన ఉత్సాహంతో జలంతో పాటు ఆకాశంలో వెళ్లటం ప్రారంభిస్తున్నామని చెప్పారు.