ఫిల్మ్ నగర్ లో ఆక్రమణల కూల్చివేత
దూకుడు పెంచిన హైడ్రా కమిషనర్
హైదరాబాద్ – మరోసారి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వార్తల్లోకి ఎక్కారు. ఆయన ఇటీవలే బెంగళూరులో తన బృందంతో కలిసి వెళ్లారు. అక్కడ సరస్సులు, చెరువుల పరిరక్షణతో పాటు పర్యావరణ కేంద్రాన్ని కూడా సందర్శించారు. ఇదే సమయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. అక్కడి నుంచి వచ్చిన వెంటనే ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేశారు.
శనివారం హైదరాబాద్ లోని ఫిలిం నగర్ లో చాలా కాలంగా ఉన్న ఆక్రమణలపై ఫిర్యాదులు రావడంతో రంగంలోకి దిగింది హైడ్రా. స్థానికులు చేసిన ఫిర్యాదు మేరకు తాము కూల్చివేతలు ప్రారంభించడం జరిగిందన్నారు ఏవీ రంగనాథ్. ఈ మేరకు ఎక్స్ వేదికగా కూల్చివేతలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు.
ప్రధాన రహదారిపై అక్రమంగా నిర్మాణాలు చేపట్టాలరని ఆరోపించినట్లు తెలిపారు. దీంతో హైడ్రా వాటిని తొలగించిందని తెలిపారు. తనిఖీ సమయంలో, హైడ్రా అధికారులు ఇంటి సరిహద్దు గోడ , షెడ్‌తో సహా నిర్మాణాలు రహదారిపై ఆక్రమణకు గురైనట్లు నిర్ధారించారు.
కూల్చివేత తరువాత, శిధిలాలు తొలగించడం జరిగిందన్నారు కమిషనర్. రోడ్డు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జీహెచ్‌ఎంసీ ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతిని రంగనాథ్ ఆదేశించారు. రోడ్డు విస్తరణపై సంతోషం వ్యక్తం చేశారు స్థానికులు. 15 ఏళ్లుగా నిర్మాణాలు జరుగుతున్నాయని గుర్తించడం విశేషం.