NEWSTELANGANA

విధ్వంసం సృష్టిస్తూ విజ‌యోత్స‌వాలా..?

Share it with your family & friends

తెలంగాణ ప్ర‌భుత్వంపై కేటీఆర్ కామెంట్స్

హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్ర స‌ర్కార్ పూర్తిగా ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌ను అవ‌లంభిస్తోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎక్స్ వేదిక‌గా ఆయ‌న స్పందించారు. ఓ వైపు అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేశార‌ని, ఇంకో వైపు విధ్వంసాలు సృష్టిస్తూ విజ‌యోత్సవాలు చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించ‌డం ప‌ట్ల విస్మ‌యం వ్య‌క్తం చేశారు కేటీఆర్. ఎనుముల రేవంత్ రెడ్డి ఏడాది పాల‌న‌లో తెలంగాణ పూర్తిగా నిర్ల‌క్ష్యానికి, వివ‌క్ష‌కు, అన్యాయానికి గురైంద‌ని వాపోయారు.

కాంగ్రెస్ సర్కారు కొలువుదీరి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా నిర్వహించాల్సింది విజయోత్సవాలు కాదు.. “కుంభకోణాల కుంభమేళా” అని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీకి పాతరేసిన నేపథ్యంలో జరపాల్సింది విజయోత్సవాలు కాదు.. ప్రజావంచన వారోత్సవాలంటూ మండిప‌డ్డారు కేటీఆర్.

ఎనుముల వారి ఏడాది పాలనలో చెప్పుకోవడానికి ఏమున్నది గర్వకారణం అంటే..
మూసీలో లక్షన్నర కోట్ల మూటల వేట..! కొడంగల్ లిఫ్టులో వేల కోట్ల కాసుల వేట..!! బావ మరిదికి అమృత్ టెండర్లను, కొడుకులకు వేలకోట్ల కాంట్రాక్టులను కట్టబెట్టే ముఖ్యమంత్రి, మంత్రులు జరుపుకోవాల్సింది విజయోత్సవాలు కాదు.. “కరప్షన్ కార్నివాల్” అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ఏడాది కాలంగా ప్రతిరోజూ పరిపాలనా వైఫల్యాలకు కేరాఫ్ కాంగ్రెస్ సర్కారు మారింద‌న్నారు. సకల రంగాల్లో సంక్షోభం తప్ప సంతోషం లేని సందర్భాలకు చిరునామా రేవంత్ పాలన అని ఎద్దేవా చేశారు. ఏ ముఖం పెట్టుకుని విజయోత్సవాలు నిర్వహిస్తారంటూ ప్ర‌శ్నించారు కేటీఆర్.

రుణమాఫీ కాక, పెట్టుబడి సాయం అందక పేద రైతులు దుఖంలో ఉంటే మీరు వందల కోట్లతో విజయోత్సవాలు చేసుకోవాల‌ని అనుకోవ‌డం ఎంత వ‌ర‌కు భావ్యం అని అన్నారు.

బీఆర్ఎస్ భర్తీచేసిన ఉద్యోగాల ప్రక్రియను మీ ఖాతాలో వేసుకోవడం నయవంచన కాదా ? పావుశాతం కూడా రుణమాఫీ పూర్తి చేయకుండా వందశాతం చేశామని చెప్పుకోవడం దగా కాదా ? 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 కే సిలిండర్ పథకాలకు సవాలక్ష ఆంక్షలు పెట్టి మెజారిటీ అర్హులను దూరం చేయడం మోసం కాదా అని నిల‌దీశారు.

75 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో అతితక్కువ సమయంలో అత్యధిక ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్న తొలి ప్రభుత్వం, ఏకైక రాష్ట్ర ప్రభుత్వం ఇదేన‌ని స్ప‌ష్టం చేశారు.