నటుడు ఢిల్లీ గణేష్ ఇక లేరు
శోక సంద్రంలో తమిళ సినీ ఇండస్ట్రీ
చెన్నై – తమిళ సినీ రంగానికి చెందిన ప్రముఖ నటుడు ఢిల్లీ గణేశ్ కన్ను మూశారు. ఆయనకు 80 ఏళ్లు. అనారోగ్య కారణాలతో మృతి చెందారు. ఈ విషయాన్ని కుటుంబీకులు తెలిపారు. ఢిల్లీ గణేష్ మృతితో తమిళ సినీ రంగంలో విషాదం అలుముకుంది. ఆయన మృతి పట్ల తమిళ, కన్నడ, తెలుగు, హిందీ, మలయాళ సినీ రంగాలకు చెందిన ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
ఢిల్లీ గణేష్ విలక్షణ నటుడిగా గుర్తింపు పొందారు. ఎన్నో విజయవంతమైన సినిమాలలో నటించారు. కీలక పాత్రలు పోషించారు. అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. చివరి దాకా నటిస్తూనే ఉన్నారు. ఒకానొక సందర్బంలో తాను నటించకుండా ఉండలేనని పేర్కొన్నారు.
గొప్ప నటుడినే కాదు అంతకు మించి సహృదయత కలిగిన మనిషిని కోల్పోవడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు వీటీకే చీఫ్, సినీ సూపర్ స్టార్ తళపతి విజయ్. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ , తనయుడు, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్, తదితరులు తీవ్ర సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.
ఇదిలా ఉండగా ఢిల్లీ గణేశ్ తన సినీ ప్రస్థానంలో 400 సినిమాలకు పైగా నటించారు. ఎన్నో అవార్డులు అందుకున్నారు. మరెన్నో పురస్కారాలు పొందారు.