తిరుమల పవిత్రతను కాపాడండి- పవన్ కళ్యాణ్
టీటీడీ జనసేన అభ్యర్థులకు దిశా నిర్దేశం
అమరావతి – ఏపీ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన పదే పదే ఈ మధ్యన సనాతన ధర్మం గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ వస్తున్నారు. అవసరమైతే ఎంత దాకా అయినా సరే పోరాడేందుకు సిద్దంగా ఉన్నానంటూ ప్రకటించారు. ఈ తరుణంలో దేశంలోనే అత్యధిక ఆదాయంతో పాటు ఎక్కువ మంది భక్తులు దర్శించుకునే తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలికి ఏపీ కూటమి ప్రభుత్వం చైర్మన్ తో పాటు సభ్యులను నియమించింది.
ఈ సందర్బంగా టీడీపీతో పాటు జనసేన పార్టీకి చెందిన వారికి ఛాన్స్ ఇచ్చింది. పార్టీ తరపున టీటీడీ సభ్యులుగా ప్రమాణం స్వీకారం చేసిన అనంతరం మర్యాద పూర్వకంగా ఏపీ డిప్యూటీ సీఎంను మంగళగిరి లోని కార్యాలయంలో కలుసుకున్నారు.
పదవీ బాధ్యతలు చేపట్టిన బి.మహేందర్ రెడ్డి, అనుగోలు రంగశ్రీ, బి.ఆనంద సాయిలను కొణిదెల పవన్ కళ్యాణ్ శాలువాలతో సత్కరించారు. ఘనంగా సన్మానించారు. తమకు జీవితంలో మరిచి పోలేని టీటీడీ పదవిని కట్టబెట్టినందుకు ధన్యవాదాలు తెలిపారు సభ్యులు.
ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ కొణిదెల వారికి దిశా నిర్దేశనం చేశారు. తిరుమల క్షేత్రం పవిత్రతను కాపాడే బృహత్తర బాధ్యతను నియమబద్ధంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వర్తించాలని సూచించారు. ఒక క్లిష్ట సమయంలో టీటీడీ సభ్యులయ్యారని, సనాతన ధర్మాన్ని పరిరక్షించే దిశగా మీ ప్రయాణం సాగాలని కోరారు. ఈ సమావేశంలో పార్టీ కోశాధికారి ఎ.వి.రత్నం పాల్గొన్నారు.