7 నుంచి కాంగ్రెస్ వైఫల్య వారోత్సవాలు
నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కేటీఆర్
వరంగల్ జిల్లా – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన ఓరుగల్లు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్బంగా మార్గమధ్యంలో ఆయనకు ఘన స్వాగతం పలికారు గులాబీ శ్రేణులు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ కు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
అనంతరం హన్మకొండలో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఏం సాధించారని కాంగ్రెస్ ప్రభుత్వం విజయోత్సవాలని అనుకుంటోందని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలలో ఒక్కటైనా అమలు చేశారా అని నిలదీశారు కేటీఆర్.
ఆ పార్టీ ఆధ్వర్యంలో అన్నీ వైఫల్యాలు తప్ప విజయాలు ఎక్కడ ఉన్నాయని అందుకే తమ పార్టీ ఆధ్వర్వంలో వచ్చే డిసెంబర్ 7వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ వైఫల్య వారోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించడం జరిగిందని చెప్పారు.
ఇదే సమయంలో రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీని వాస్ రెడ్డిని ఏకి పారేశారు. ఆయన పదే పదే బాంబులు వేస్తానంటూ ప్రకటిస్తున్నారని, ఆయనకు బాంబుల శాఖ మంత్రి అని పేరు పెడితే సరిపోతుందంటూ ఎద్దేవా చేశారు.
పాలన చేతకాక తమపై బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారంటూ ధ్వజమెత్తారు. స్థాయికి తగినట్లు మాట్లాడక పోవడం దారుణమన్నారు.