ఏపీలో ఐఏఎస్ లకు స్థాన చలనం
పలువురిని బదిలీ చేసిన ప్రభుత్వం
అమరావతి – ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం పాలనా పరంగా చర్యలు చేపట్టింది. సీఎం నారా చంద్రబాబు నాయుడు దూకుడు పెంచారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అంటకాగిన ఉన్నతాధికారులపై కన్నేసి ఉంచారు. ఇంకో వైపు పాలనా పరంగా మరింత సమర్థులైన వారికి ప్రయారిటీ ఇస్తున్నారు. ఇందులో భాగంగా పలువురు ఐఏఎస్ లకు స్థాన చలనం కలిగింది.
ఈ మేరకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ కీలక ప్రకటన చేశారు. పలువురు ఐఏఎస్ లను బదిలీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. కీలకమైన ఆర్థిక శాఖ కార్యదర్శిగా తెలంగాణ నుంచి ఏపీకి వచ్చిన రొనాల్డ్ రోస్ కు బాధ్యతలు అప్పగించింది.
ఇక ఏపీ మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా కె.కన్నబాబుకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు నీరబ్ కుమార్ ప్రసాద్. మరో కీలకమైన శాఖ స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ కు మేనేజింగ్ డైరెక్టర్ గా బి.అనిల్ కుమార్‌రెడ్డిని నియమించింది.
కార్మిక, ఫ్యాక్టరీలు, బాయిలర్లు, ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ అదనపు కార్యదర్శిగా గంధం చంద్రుడును నియమించింది. అంతే కాకుండా ఏపీ వ్యవసాయ, సహకార శాఖ డిప్యూటీ సెక్రటరీగా డి.హరితకు బాధ్యతలు అప్పగించింది.