రైతు భరోసాకు దిక్కేది..పంట భీమాకు దారేది..?
బీఆర్ఎస్ సీనియర్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డి
హైదరాబాద్ – బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఏనుగుల రాకేశ్ రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని, ఇచ్చిన ఏ హామీని అమలు చేయడం లేదని ఆరోపించారు. ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. రైతు భరోసాకు దిక్కు లేదు..రుణ మాఫీ చేసేందుకు మొఖం లేదంటూ ఎద్దేవా చేశారు.
రైతు భీమాకు మంగళం పాడారని, ఇచ్చిన హామీలు అటకెక్కించారని కేవలం ప్రభుత్వం , సీఎం రేవంత్ రెడ్డి ప్రచారానికే ప్రయారిటీ ఇస్తున్నారని రైతుల గురించి ఆలోచించడం లేదని ఆరోపించారు ఏనుగుల రాకేశ్ రెడ్డి. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వడం లేదని, దీంతో ప్రభుత్వ మార్కెట్ లలోకి కాకుండా, బయట వ్యాపారస్తులకు ధాన్యాన్ని అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
బోనస్ ఇస్తామని నమ్మించి మోసం చేయడంతో రైతులు ఆందోళనలో ఉన్నారని, చేసిన అప్పులు తీర్చ లేక ఆత్మహత్యలకు పాల్పడే ప్రమాదం ఉందని వాపోయారు ఏనుగుల రాకేశ్ రెడ్డి. మట్టిని నమ్ముకున్న రైతుల పాలిట సర్కార్ శాపంగా మారిందని ధ్వజమెత్తారు. ఇదేనా మీ ప్రజా పాలన అంటూ నిప్పులు చెరిగారు.
మాయ మాటలతో రైతుల బతుకులకు మసి పూయడమేనా ఇందిరమ్మ రాజ్యం రేవంత్ రెడ్డి అంటూ ప్రశ్నించారు బీఆర్ఎస్ సీనియర్ నేత. ఇకనైనా ఇచ్చిన హామీల దేవుడెరుగు..రైతులకు భరోసా కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఏనుగుల రాకేశ్ రెడ్డి.