ప్రచారం ఎక్కువ పని తక్కువ
చంద్రబాబుపై జగన్ రెడ్డి ఫైర్
అమరావతి – ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రచారం చేసుకోవడంలో ముందుండడం తప్ప ప్రజా సమస్యలను పరిష్కారించాలన్న సోయి ఆయనకు లేదంటూ మండిపడ్డారు.
ఎక్స్ వేదికగా మాజీ సీఎం స్పందించారు. సీ ప్లేన్ పేరుతో ఏదో అభివృద్ది సాధించినట్లు ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. రూ.8,480 కోట్లతో మారుమూల ప్రాంతాల్లో అత్యాధునిక వైద్యాన్ని అందుబాటులోకి తెస్తూ, మల్టీ స్పెషాల్టీ ఆస్పత్రులను కట్టించడం, 17 మెడికల్ కాలేజీలు నిర్మించడం సంపద సృష్టి అవుతుందా? లేక వాటిని ప్రైవేట్ పరం పేరుతో మీ మనుషులకు కట్టబెట్టాలని అనుకోవడం సంపద సృష్టించడం అవుతుందా చెప్పాలని నిలదీశారు.
సుదీర్ఘ తీర ప్రాంతాన్ని వినియోగించుకుని మెరుగైన వాణిజ్యాన్ని, రాష్ట్రానికి అదనపు ఆదాయాన్ని, ప్రజలకు ఉపాధిని, పారిశ్రామిక ప్రగతిని సాధించడానికి ప్రభుత్వ రంగంలో రూ.4,361.91కోట్లతో మూలపేట, రూ.5,156 కోట్లతో మచిలీపట్నం, రూ.3,736.14 కోట్లతో రామాయపట్నంల వద్ద 3 పోర్టులను రూ.13,254.05 కోట్లతో నిర్మించామన్నారు.
ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, పోర్టుల రూపేణా మొత్తంగా రూ.21,734 కోట్ల పబ్లిక్ ఇన్వెస్టిమెంట్ ప్రజల ఆస్తి కాదా? ప్రజల కోసం సృష్టించిన సంపద కాదా చంద్రబాబూ? అని మండిపడ్డారు.