గాడి తప్పిన రేవంత్ పాలన – హరీశ్
కాంగ్రెస్ సర్కార్ బక్వాస్..బేకార్
హైదరాబాద్ – రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన గాడి తప్పిందని, రైతుల పాలిట శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు. గరీబి హటావో అని ఆనాడు ఇందిరా గాంధీ పిలుపునిస్తే ..ఫార్మా సిటీ పేరుతో పచ్చని పంట పొలాల నుండి కిసాన్ హటావో అనిరేవంత్ రెడ్డి పిలుపునిస్తున్నాడని ధ్వజమెత్తారు.
రేవంత్ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా తయారైందని సంచలన వ్యాఖ్యలు చేశారు తన్నీరు హరీశ్ రావు. ఇవాళ సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న వికారాబాద్ జిల్లా రైతన్నలపై పిడుగు పడిందన్నారు.
అందుకే రైతులు రేవంత్ మీద ఉన్న కోపాన్ని జిల్లా కలెక్టర్, ప్రభుత్వ అధికారుల మీద చూపుతున్నారని అన్నారు. అసమర్థ పాలనకు ఐఎఎస్ లు, ప్రభుత్వ అధికారులు ప్రజాగ్రహానికి గురవుతున్నారని ఇకనైనా కొంత తగ్గితే మంచిదని హితవు పలికారు.
ఫార్మా సిటీ కోసం కెసీఆర్ హైద్రాబాద్ కు దగ్గరగా, కాలుష్యం లేకుండా, జీరో వ్యర్థాలతో 15 వేల ఎకరాలు సేకరించి సిద్దం చేసిండని తెలిపారు.
పర్యావరణం, అటవీ సహా అన్ని రకాల అనుమతులు వచ్చిన దాన్ని పక్కన బెట్టి పచ్చటి పొలాల్లో ఫార్మా చిచ్చు బెడుతున్నాడని ఆరోపించారు. జహీరాబాద్ న్యాల్కల్ మండలంలోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొందన్నారు.
ఫార్మసిటీ కోసం సేకరించిన భూమిని తన రియల్ ఎస్టేట్ దందా కోసం వినియోగించే కుట్రతో ఈ సమస్య మొదలైందన్నారు హరీశ్ రావు.
నీ మీద, నీ పాలన మీద తిరగబడని వర్గం ఏదైనా ఉందా రేవంత్ రెడ్డి అని ప్రశ్నించారు. ఇప్పటికైనా పిచ్చి పనులు మాని పరిపాలన మీద దృష్టి పెట్టాలని, పచ్చని పొలాల్లో ఫార్మా కంపెనీ ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని బిఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు.