అసెంబ్లీకి రాక పోతే చర్యలు తప్పవు – స్పీకర్
మాజీ సీఎం జగన్ రెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్
అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ సభాపతి (స్పీకర్ ) చింతకాయల అయ్యన్న పాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు. శాసన సభ బీఏసీ సమావేశం జరిగింది. ఈ కీలక సమావేశానికి స్పీకర్ తో పాటు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, బీజేపీ పక్ష నేత విష్ణు కుమార్ రాజు హాజరయ్యారు.
కాగా ప్రతిపక్ష నాయకుడిగా వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరు కాక పోవడాన్ని తీవ్రంగా పరిగణించారు స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు. ఒక బాధ్యత కలిగిన నాయకుడిగా చట్టాలను గౌరవించాలని అన్నారు. కానీ ఆయనకు చట్టం పట్ల, ప్రజల పట్ల, అసెంబ్లీ పట్ల గౌరవం లేదన్నారు స్పీకర్. ఇలాంటి వాళ్లు ఎలా ప్రజల కోసం పని చేస్తారంటూ ప్రశ్నించారు.
ఈ సందర్బంగా సంచలన వ్యాఖ్యలు చేశారు చింతకాయల అయ్యన్న పాత్రుడు జగన్ రెడ్డిపై. తను అసెంబ్లీకి రాక పోతే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందన్నారు. ఈ నెల 22 వరకు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని, ప్రజా సమస్యలను ప్రస్తావించాలని, అంతే కాకుండా అర్థవంతమైన చర్చలు జరగాలని సూచించారు స్పీకర్.
ఇదిలా ఉండగా అసెంబ్లీ కమిటీ హాల్ లో మంగళవారం ఎమ్మెల్యేలందరికీ శిక్షణ తరగతులు ఉంటాయన్నారు. బిల్లులు, చర్చలకు అనుగుణంగా కొన్ని రోజులు రెండు పూటలా అసెంబ్లీ ఉంటుందన్నారు. 8 బిల్లులతో పాటు ప్రభుత్వ పాలసీలకు ఆమోదం తెలపాలని నిర్ణయించారు.