NEWSANDHRA PRADESH

రూ. 91,253 కోట్ల లెక్క‌లు ఎక్క‌డ

Share it with your family & friends

ఏపీ స‌ర్కార్ ను ప్ర‌శ్నించిన నాదెండ్ల

అమ‌రావ‌తి – జ‌న‌సేన పార్టీ రాజ‌కీయ వ్య‌వ‌హారాల క‌మిటీ చైర్మ‌న్ నాదెండ్ల మ‌నోహ‌ర్ ఏపీ స‌ర్కార్ పై నిప్పులు చెరిగారు. సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం గడచిన నాలుగు సంవత్సరాలలో కేవలం రూ.1.72 కోట్లు మాత్రమే అప్పు చేశామని చెబుతోందన్నారు.

కానీ ఈ ప్రభుత్వం చేసిన మరో రూ. 91,253.39 కోట్ల అప్పుకి లెక్కలు మాత్రం చెప్ప‌డం లేద‌న్నారు. దీనిపై పూర్తిగా ప్ర‌జ‌ల‌కు తెలియాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. అన్ని వేల కోట్లు ఎవ‌రి బొక్క‌సం లోకి వెళ్లాయో చెప్పి తీరాలంటూ మ‌నోహ‌ర్ డిమాండ్ చేశారు.

విచిత్రం ఏమిటంటే ఎక్కడా లేని విధంగా, ఎవరికీ అర్థం కాని విధంగా రివ‌ర్స్ బారోయింగ్ అనే పేరుతో కొత్త విధానాన్ని తీసుకు వ‌చ్చార‌ని , దీని ద్వారానే కోట్లు అప్పు చేశార‌ని కానీ లెక్క‌లు మాత్రం చెప్ప‌క పోవ‌డం దారుణ‌మ‌న్నారు మ‌నోహ‌ర్.

ఈ మొత్తాన్ని లెక్కల్లోకి రాకుండా దాచేశారని ఆరోపించారు. బడ్జెట్ ప్రిపరేషన్ లో ఈ విషయం బయట పడిందన్నారు. ఆ కోట్ల లెక్కలు, ఎటు పోయాయ‌నేది ప్రభుత్వ పెద్దలకు, ఆర్థిక శాఖ ముఖ్య అధికారికి మాత్రమే తెలుసన్నారు.