ప్రజల్లో అసంతృప్తి ప్రమాదం – రాకేశ్ రెడ్డి
వికారాబాద్ కలెక్టర్ పై దాడి దారుణం
హైదరాబాద్ – రోజు రోజుకు కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, వారిలో నెలకొన్న అసంతృప్తి మరింత ఆందోళనలు రేకెత్తించేలా చేస్తోందని అన్నారు బీఆర్ఎస్ సీనియర్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి స్వంత నియోజకవర్గంలోనే ప్రజలు తిరగబడటం, జిల్లా కలెక్టర్ , కుడా అధికారితో పాటు ఎమ్మార్వోలపై దాడికి దిగడం గాడి తప్పిన పాలనకు నిదర్శనం అన్నారు .
ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన సీఎం ఇలా ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడితే ఇబ్బందులు ఏర్పడతాయని తెలుసుకుంటే మంచిదని సూచించారు. అధికారం శాశ్వతం కాదని, దానిని అడ్డం పెట్టుకుని ఏమైనా చేస్తామంటే ఎవరూ ఊరుకోరని పేర్కొన్నారు.
దిశా నిర్దేశం చేయాల్సిన వాళ్లు ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా చర్యలు తీసుకుంటే ఎలా అని ప్రశ్నించారు ఏనుగుల రాకేశ్ రెడ్డి. మీ వల్ల ఉన్నతాధికారులు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారని, దీనిని గుర్తించాలని అన్నారు.
ఒకవైపు కులగణన అంటూ సర్వే పేరుతో ఉపాధ్యాయులను ఊర్లకు పంపితే కాంగ్రెస్ హామీలు ఎక్కడా అని ప్రజలు నిలదీస్తున్నారని, ఇంకో వైపు అధికారులపై దాడులకు దిగే స్థాయికి పాలన దిగజారడం మంచిది కాదన్నారు ఏనుగుల రాకేశ్ రెడ్డి.
చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోకూడదని, ఏదైనా సామరస్య పూర్వకమైన ధోరణితో ముందుకు వెళ్లాలని కోరారు. ఈ దాడిని పూర్తిగా ఖండిస్తున్నట్లు స్పష్టం చేశారు.