లగచర్ల గ్రామస్తుల దాడి వెనుక కుట్ర
బీఆర్ఎస్ నాయకుడి ప్రమేయం
వికారాబాద్ జిల్లా – రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దుద్వాల మండలం లగచర్ల గ్రామస్థుల దాడి ఘటనపై తీవ్రంగా స్పందించారు మల్టీ జోన్ ఐజీపీ వి. సత్య నారాయణ. ఆయన మీడియాతో మాట్లాడారు. గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక పథకం ప్రకారం జరిగిన దాడిగా ఆయన అభివర్ణించారు.
జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ , అడిషనల్ కలెక్టర్ నాయక్, కోడంగల్ డెవలప్ మెంట్ అథారిటీ ఆఫీసర్ వెంకట్ రెడ్డి, ఎమ్మార్వో విజయ్ కుమార్ పై పనిగట్టుకుని దాడికి పాల్పడడంతో పాటు వాహనాలను ధ్వంసం చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైనా సరే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించేది లేదని హెచ్చరించారు.
వికారాబాద్ జిల్లా అధికారులపై దాడికి సంబంధించి బీఆర్ఎస్ యువ నాయకుడు ఉన్నట్లు తమకు సమాచారం ఉందని అన్నారు ఐజీపీ వి. సత్యనారాయణ. ముందస్తు ప్రణాళికతో జరిగిన దాడికి ప్రతిపక్ష పార్టీ యువనేత నేతృత్వం వహించారని ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ చెప్పారు.
ఈ మొత్తం వ్యవహారంపై విచారణ చేపట్టామని, దాడికి పాల్పడిన వారిని గుర్తిస్తామని , ఎవరిని వదిలి పెట్టే ప్రసక్తి లేదన్నారు. ఇదిలా ఉండగా తనపై దాడి జరగలేదని, గ్రామస్తులను ఏమీ అనొద్దని పేర్కొన్నారు కలెక్టర్ ప్రతీక్ జైన్.