కాంగ్రెస్ సర్కార్ బక్వాస్ – హరీశ్ రావు
సంజయ్ పాదయాత్ర ట్రైలర్ మాత్రమే
హైదరాబాద్ – మాజీ మంత్రి హరీశ్ రావు నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్ర సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ చేపట్టిన పాదయాత్ర ట్రైలర్ మాత్రమేనని, ముందుంది ముసళ్ల పండగ అని అన్నారు.
రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డికి 70 ఎంఎం సినిమా చూపించడం ఖాయమన్నారు. సంజయ్ రైతుల కోసం మహా పాదయాత్ర చేపట్టడం అభినందనీయమని ప్రశంసించారు.
వెన్నుముక శస్త్ర చికిత్స చేసే డాక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్న సంజయ్ ఈ రోజు దేశానికి వెన్నుముక అయిన రైతుల కోసం 25 కిలోమీటర్లు పాదయాత్ర చేశారని అన్నారు. రేవంత్ పాలనలో రైతుల ధాన్యం దళారుల పాలయ్యిందని ఆరోపించారు. బోనస్ బోగస్ అయ్యిందని.. రైతు బంధు రాదు, రుణ మాఫీ కాదన్నారు హరీశ్ రావు.
నా ఎమ్మెల్యే పదవి కంటే 60 లక్షల మంది రైతులకు రుణమాఫీ కావడమే నాకు ముఖ్యమని నేను రాజీనామాకు సిద్ధమయ్యానని ప్రకటించారు. మహారాష్ట్ర ఎన్నికల్లో వరి పంటకు బోనస్ ఇచ్చామని రేవంత్ అబద్ధ ప్రచారం చేస్తున్నాడని ఆరోపించారు. జగిత్యాల వరద కాలువను రిజర్వాయర్‌గా మార్చిండు కేసీఆర్ అని అన్నారు.