ప్రతీక్ జైన్ కు పరామర్శల వెల్లువ
నిబద్దత కలిగిన అధికారిగా గుర్తింపు
వికారాబాద్ జిల్లా – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న వికారాబాద్ జిల్లా కోడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగచర్ల గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ప్రజాభిప్రాయ సేకరణ చేసేందుకు వెళ్లిన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తో పాటు జాయింట్ కలెక్టర్ నాయక్, కోడంగల్ డెవలప్ మెంట్ అథారిటీ అధికారి వెంకట్ రెడ్డి, ఎమ్మార్వో విజయ్ కుమార్ లను ఉరికించి కొట్టారు. చివరకు ప్రాణాపాయం నుంచి బయట పడ్డారు వీరంతా.
ఇందుకు సంబంధించిన విజువల్స్ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. దీనికి సంబంధించి పోలీసులు రంగంలోకి దిగారు. లగచర్ల గ్రామాన్ని చుట్టుముట్టారు. పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు. చాలా మంది గ్రామస్థులను అరెస్ట్ చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ తరుణంలో గ్రామస్థుల చేతిలో దాడికి గురైన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ కు పరామర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇదిలా ఉండగా ప్రతీక్ జైన్ ఐఏఎస్ 2017 బ్యాచ్ కు చెందిన వారు. రంగారెడ్డి జిల్లాలో అడిషనల్ కలెక్టర్ గా పనిచేశారు. ఆయనను చీఫ్ సెక్రటరీ శాంతి కుమారితో పాటు సీనియర్ ఆఫీసర్లు , సొంత బ్యాచ్ ఐఏఎస్ లు పరామర్శించారు. కాగా ఐఏఎస్ అధికారుల సంఘం ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.