ఏపీలో 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు
కల్పిస్తామన్న మంత్రి నారా లోకేష్
అమరావతి – ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ది, ఉద్యోగాల కల్పన, పరిశ్రమల ఏర్పాటుపై ఎక్కువగా ఫోకస్ పెట్టింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు యువ నాయకుడు విద్యా, ఐటీ, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి నారా లోకేష్ ఫుల్ ఫోకస్ పెట్టారు.
ఎన్నికల సందర్బంగా యువతకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో రానున్న 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు మంత్రి గానే కాకుండా ఉద్యోగాల కల్పన సబ్ కమిటీ చైర్మన్ గా నారా లోకేష్ ప్రణాళిక బద్ధంగా కృషి చేస్తున్నారు.
ఈ మధ్యనే స్టీల్ దిగ్గజం ఆదిత్య మిట్టల్ తో ఒక్క వీడియో కాన్ఫరెన్స్ తో 1.4 లక్షల కోట్ల పెట్టుబడిని ఖరారు చేశారు. ఇప్పటికే ఏపీలో సౌర, పవన విద్యుత్ రంగంలో 40 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు టాటా పవర్ ముందుకు వచ్చింది.
తాజాగా అమెరికా పర్యటనకు ముందు ముంబైలో రిలయన్స్ సంస్థ అధినేతలతో మంత్రి లోకేష్ జరిపిన చర్చలు కేవలం 30 రోజుల్లోనే కార్యరూపం దాల్చాయి. ఏపీలో రూ. 65 వేల కోట్ల పెట్టుబడులకు రిలయన్స్ ఎనర్జీ సిద్దమైంది.