DEVOTIONAL

శ్రీవారి ఆలయంలో వైభవంగా కైశిక ద్వాదశి ఆస్థానం

Share it with your family & friends

శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తి దర్శనం

తిరుమల – కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో బుధవారం కైశిక ద్వాదశి ఆస్థానం వేడుక‌గా జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా వేకువ ఝామున 4.30 నుండి 5.30 గంటల వ‌ర‌కు శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తి ఆల‌య మాడ వీధుల్లో భక్తులను కటాక్షించారు.

అక్కడక్కడా చిరు జల్లులు కురవడంతో ఘటాటోపం లోపల స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. వేంకటతురైవార్‌, స్నపనబేరంగా పిలిచే ఉగ్ర శ్రీనివాసమూర్తిని శ్రీదేవి భూదేవి సమేతంగా ఒక్క కైశిక ద్వాదశి రోజు మాత్రమే సూర్యోదయానికి ముందు మాడవీ ధులలో ఊరేగిస్తారు. అనంతరం స్వామి, అమ్మ వార్ల‌ను బంగారు వాకిలి చెంత వేంచేపు చేసి అర్చకులు పురాణ పఠనంతో కైశిక ద్వాదశి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.

పురాణాల ప్ర‌కారం శ్రీ వైష్ణ‌వ క్షేత్రాల్లో నిర్వ‌హించే ముఖ్య‌మైన ప‌ర్వ‌దినాల్లో కైశిక ద్వాద‌శి ఒక‌టి. శ్రీ వ‌రాహ పెరుమాళ్ కైశిక పురాణంలోని 82 శ్లోకాల‌తో శ్రీ భూదేవికి క‌థ‌గా చెప్పిన రోజును కైశిక ఏకాద‌శిగా పిలుస్తారు. ఈ క‌థ ఆధారంగా కైశిక ద్వాద‌శి ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకుంది.

కైశిక ద్వాదశి పురాణ నేపథ్యం విశేష ఘట్టాలతో కూడుకున్నది. శ్రీనంబదువాన్‌ (సత్యమూర్తి) అనే భక్తుడు స్వామి వారికి కైశిక రాగంలో అక్షరమాలను నివేదించడానికి వెళుతుండగా మార్గమధ్యంలో ఒక బ్రహ్మరాక్షసుడు తారసపడి తినేస్తానన్నాడు.

తాను శ్రీవారికి సంకీర్తనార్చన చేయడానికి వెళుతున్నానని తప్పక తిరిగివచ్చి ఆ బ్రహ్మరాక్షసుని క్షుద్బాధను తీరుస్తానని నంబదువాన్ ప్రమాణం చేశాడు. అన్న ప్రకారం స్వామివారికి కైశిక రాగంలో అక్షరమాలను నివేదించి బ్రహ్మరాక్షసుని చెంతకు వచ్చాడు. భక్త నంబదువాన్‌ భక్తికి, సత్యనిరతికి ముగ్ధుడై స్వామివారు మోక్షం ప్రసాదించారు. ఈ విధంగా ఉత్తాన ద్వాదశికి కైశికద్వాదశి అనే నామకరణం కలిగింది.

ఈ కార్యక్రమంలో శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయర్ స్వామి, టీటీడీ అడిషనల్ ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, సీవీఎస్వో శ్రీధర్, డిప్యూటీ ఈవో లోకనాథం, పేష్కార్ రామకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.