NEWSTELANGANA

ప్ర‌జా పాల‌న కాదు ప్ర‌తీకార పాల‌న

Share it with your family & friends

ఏనుగుల రాకేశ్ రెడ్డి షాకింగ్ కామెంట్స్

హైద‌రాబాద్ – బీఆర్ఎస్ సీనియ‌ర్ నాయ‌కుడు ఏనుగుల రాకేశ్ రెడ్డి సీరియ‌స్ కామెంట్స్ చేశారు. రైతుల ప‌క్షాన పోరాటం చేస్తే నేరం ఎలా అవుతుందంటూ ప్ర‌శ్నించారు. రాష్ట్రంలో రాచ‌రిక పాల‌న సాగుతోంద‌ని ఆరోపించారు. ఎక్స్ వేదిక‌గా ఆయ‌న స్పందించారు.

సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కోడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలోని ల‌గ‌చ‌ర్ల గ్రామ‌స్తులు త‌మ భూములు ఇచ్చే ప్ర‌స‌క్తి లేద‌ని చెప్పిన పాపానికి వారిని చిత్ర‌హింస‌ల‌కు గురి చేశార‌ని ఆరోపించారు. అన్నం పెట్టే చేతుల‌కు బేడీలు వేస్తారా అని ప్ర‌శ్నించారు ఏనుగుల రాకేశ్ రెడ్డి.

అధికారం అన్న‌ది శాశ్వ‌తం కాద‌ని, అది కొంత కాలం మాత్రమే ఉంటుంద‌ని సీఎం తెలుసుకుంటే మంచిద‌న్నారు. కేటీఆర్ ను అక్ర‌మంగా ఏదో ర‌కంగా కేసులో ఇరికించి జైలుకు పంపించాల‌ని తెలంగాణ కాంగ్రెస్ ప్ర‌భుత్వం య‌త్నిస్తోంద‌ని మండిప‌డ్డారు.

అరెస్ట్ లు, కేసుల‌తో బీఆర్ఎస్ నేత‌ల‌ను ఆప‌లేర‌న్నారు. ఇది పూర్తిగా అప్ర‌జాస్వామిక‌మ‌ని పేర్కొన్నారు .
రైతుల‌కు అండ‌గా నిలిచిన కేటీఆర్ ను టార్గెట్ చేయ‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు ఏనుగుల రాకేశ్ రెడ్డి. ఆయ‌న‌కు గ‌నుక సంకెళ్లు వేస్తే రైతాంగం మొత్తానికి సంకెళ్లు వేసిన‌ట్టేన‌ని స్ప‌ష్టం చేశారు.

పోరాటాలు, ఆందోళ‌న‌లు, అరెస్ట్ లు గులాబీ నేత‌ల‌కు కొత్త కాద‌ని రేవంత్ రెడ్డి తెలుసుకుంటే మంచిద‌ని హిత‌వు ప‌లికారు.