లగచర్ల ఘటనపై మహేష్ భగవత్ సమీక్ష
దాడులు..అరెస్ట్ లపై విస్తృతంగా ఆరా
వికారాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వికారాబాద్ జిల్లా కోడంగల్ నియోకవర్గంలోని దుద్యాల మండలం లగచర్ల దాడి ఘటనపై డీజీ మహేష్ భగవత్ ఉన్నత స్థాయి సమీక్ష చేపట్టారు. ఆయనతో పాటు ఐజీపీ వి. సత్యనారాయణ కూడా హాజరయ్యారు. ఈ సందర్బంగా పరిగి పోలీస్ స్టేషన్ ను మహేష్ భగవత్ సందర్శించారు.
లగచర్ల ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు దాడులు, అరెస్టులపై సమీక్షించారు. భూ అభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్, అధికారులపై దాడి ఘటనను పోలీసు శాఖ సీరియస్గా తీసుకుంది.
ఇప్పటికే 3 కేసులు నమోదు చేసి 20 మందిని అరెస్టు చేశారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేంద్రరెడ్డితో పాటు కీలక సూత్రధారులు సురేష్, విశాల్ ను అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ కోర్టులో విచారణ చేపట్టేందుకు పట్నం నరేందర్ రెడ్డితో పాటు ఇతరులను కస్టడీలోకి తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం తరపున పిటిషన్ దాఖలు చేశారు.
మరో వైపు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో పాటు మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేరును కూడా చేర్చడం మరింత ఉద్రిక్తతకు దారి తీసేలా చేసింది. దీనిపై సీరియస్ గా స్పందించారు కేటీఆర్. రైతులకు మద్దతు తెలపడం నేరం ఎలా అవుతుందని ప్రశ్నించారు.