తన గొయ్యి తానే తవ్వుకుంటున్న జగన్
నిప్పులు చెరిగిన సత్య కుమార్ యాదవ్
అమరావతి – ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్సీపీ చీఫ్, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై భగ్గుమన్నారు. ఎక్స్ వేదికగా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తన గొయ్యి తానే తవ్వుకుంటున్నాడని పేర్కొన్నారు .
రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఏవీ లేవన్నారు సత్యకుమార్ యాదవ్. గత 5 ఏళ్ల పాలనా కాలంలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిన ఘనత జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఎన్డీయే ప్రభుత్వం కొలువు తీరాక అన్ని వ్యవస్థలను బాగు చేసే పనిలో పడ్డామన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ప్రజాస్వామ్యం ప్రాథమిక లక్షణం. దానికి తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు .
తన రాజకీయ పునరుజ్జీవనం కోసం జగన్‌ను అరెస్టు చేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రాజకీయంగా మైలేజ్ వస్తుందని ఆశ పడుతున్నాడని , ఆయనకు అంత సీన్ లేదన్నారు. ఆయనకు సంబంధించిన కేసుల గురించి కోర్టులు చూసుకుంటాయని, కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థలు ఫోకస్ పెడతాయని పేర్కొన్నారు సత్య కుమార్ యాదవ్.
ఎవరైనా సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తే చట్టం తన పని తాను చేసుకుంటుందని పేర్కొన్నారు. జగన్ డ్రామాలు ఆపాలని సూచించారు. జగన్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా సరిపోరని ఏపీ ప్రజలు భావించారని అన్నారు.
ఆ హోదాను పొందేందుకు అవసరమైన 18 సీట్లకు గాను 11 సీట్లు మాత్రమే ఇచ్చారని తెలిపారు. అసెంబ్లీలో ప్రజల సమస్యలను లేవనెత్తకుండా పారిపోతున్నాడని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యం పట్ల జగన్ రెడ్డికి ఏమాత్రం గౌరవం లేదన్నారు.