సూపర్ సిక్స్ అమలు చేస్తున్నాం
మంత్రి కందుల దుర్గేష్ కామెంట్
అమరావతి – గత ఐదేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసిన ఘనత మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి దక్కుతుందని ఆరోపించారు ఏపీ సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్. గురువారం జరిగిన శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు ప్రవర్తించిన తీరు పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాము ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీలను అమలు చేయడం జరుగుతోందన్నారు. కూటమి సర్కార్ ఆరు నూరైనా సరే సూపర్ సిక్స్ అమలు చేస్తున్నామని చెప్పారు. రూ. 2 వేల పెన్షన్ ను మరో వెయ్యి పెంచేందుకు ఆనాడు జగన్ రెడ్డి ఐదేళ్ల పాటు పట్టిందన్నారు.
తాము వచ్చాక కేవలం 15 రోజుల్లోనే రూ. 4 వేలకు పెన్షన్ ను పెంచడం జరిగిందని స్పష్టం చేశారు కందుల దుర్గేష్. గత కొంత కాలంగా రైతులకు, విద్యార్థులకు చెల్లించలేని బకాయిలను తాము వచ్చాక తీర్చడం జరిగిందని చెప్పారు.
ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం వైసీపీకి అలవాటుగా మారిందని మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు పర్చేందుకు ఎన్ని అవాంతరాలైనా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు కందుల దుర్గేష్.