NEWSANDHRA PRADESH

మధ్యాహ్న భోజన పథకం నాణ్యతలో రాజీవద్దు

Share it with your family & friends

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆదేశం

అమ‌రావ‌తి – ఏపీ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిదెల కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో విద్యార్థులకు ‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం’ ద్వారా అందిస్తున్న ఆహారం నాణ్యతా ప్రమాణాల విషయంలో ఎక్కడా రాజీ పడవద్దని ఆదేశించారు.

ఈ పథకం నిరాటంకంగా కొనసాగేందుకు కూటమి ప్రభుత్వం రూ.1854 కోట్లు కేటాయించిందని స్ప‌ష్టం చేశారు ప‌వ‌న్ క‌ళ్యాణ్. అయితే, కొన్ని పాఠశాలల్లో నాణ్యతా సరిగా లేదనే ఫిర్యాదులు ఉప ముఖ్యమంత్రి దృష్టికి వ‌చ్చాయి. దీనిపై ఆరా తీశారు .

అధికార యంత్రాంగానికి ఈ పథకం ప్రాముఖ్యతను, పిల్లల ఆహార భద్రత పట్ల తమకు ఉండాల్సిన చిత్తశుద్ధిని ఉద్ఘాటిస్తూ కొన్ని సూచనలు చేశారు. ప్రభుత్వం సూచించిన ఆహార మెనూ ప్రకారం విద్యార్థులకి ఆహారం అందుతుందో లేదో ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టాలని అన్నారు.

నాణ్యతా ప్రమాణాలు పాటించని వారిపై కఠినంగా వ్యవహరించి బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ఎంతో బాధ్యతగా చేపట్టిన ఈ గొప్ప కార్యక్రమానికి చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరించిన వారు ఎవరైనా సరే ఉపేక్షించ కూడదని ఆదేశించారు ప‌వ‌న్ క‌ళ్యాణ్.

ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ స్పూర్తితో మొదలు పెట్టిన ఈ పథకం విద్యార్థుల కడుపు నింపేందుకే కానీ, వ్యాపారంలా మార్చి జేబులు నింపుకొనేందుకు కాదు అనే విషయం ప్రతీ ఒక్కరూ అర్థం చేసుకోవాల‌ని పేర్కొన్నారు.